Sitaram Yechury: ఏచూరి మరణం తీరని లోటు..
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:19 AM
వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఆయన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.. .. సీఎం రేవంత్‌రెడ్డి
నిరంతర పోరాటయోధుడు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కార్మికలోకానికి తీరని లోటు:కేసీఆర్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఏచూరి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారాం మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని రేవంత్ పేర్కొన్నారు. ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. కాగా సీతారాం ఏచూరి మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరనిలోటని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఏచూరి మరణం దిగ్ర్భాంతి కలిగించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఏచూరి మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఏచూరి మరణ వార్త తెలియగానే ఎయిమ్స్‌లో ఉన్న ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏచూరి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
ఆయన మరణం భారత కార్మిక లోకానికి, లౌకికవాదానికి తీరని లోటని పేర్కొన్నారు. ఏచూరి మరణం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏచూరి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఏచూరి మరణం తనకెంతో బాధను కలిగించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏచూరి మరణవార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం కోసం ఏచూరి నిరంతరం పోరాడారన్నారు. శ్రామికులు, రైతుల కోసం నిరంతరం పోరాటం చేసిన నేత ఏచూరి అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఏచూరిని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, సైద్ధాంతిక విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా ప్రజల కోసం పనిచేసిన వారిని గౌరవించడం భారతీయ సంస్కృతి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌ను కోల్పోవడం తీరని లోటు అని, హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
సీపీఎం సింబల్ సీతారాం : పార్టీ నాయకులు
సీపీఎం పార్టీకి లోగో ఉన్నా.. పార్టీ ముఖచిత్రంగా సీతారాం ఏచూరి కనిపించేవారని పార్టీ నాయకులు చెప్పుకునేవారంట. పార్టీపై ఆయన అంతగా ప్రభావితం చూపారని సీపీఎం సీనియర్ నాయకుడు వైవీ ‘ఆంధ్రజ్యోతి’కి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టు నాయకులతో సత్సంబంధాలు కొనసాగించిన సీపీఎం నాయకుల్లో ఏచూరికి ప్రత్యేక గుర్తింపు ఉందని పార్టీ నాయకులు చెబుతుంటారు. ఆయన మామ ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా.. ఆయన ఇంట్లోనే ఉంటూ ఏచూరి కొంతకాలం చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి
ఏచూరి మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఏచూరి మరణం తీవ్ర మనోవేదన కలిగించిందని సీఎం పేర్కొన్నారు. ‘భారత రాజకీయాల్లో ఆయన ఒక పెద్ద శిఖరం. కింది స్ధాయి నుంచి ఎదిగి దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయ స్థానం పొందారు.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఏచూరి మరణవార్త తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఏచూరి మరణం పేద, కార్మిక వర్గాలకు తీరని లోటు అని తెలిపారు. కాగా ఏచూరి సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను సాధిద్దామని సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఏచూరికి నివాళులర్పించింది.
ఏచూరి నాకు మంచి స్నేహితుడు: వెంకయ్య
సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భారంతి వ్యక్తం చేశారు. ఏచూరి తనకు మంచి స్నేహితుడు అన్నారు. సైద్ధాంతికంగా వ్యతిరేక భావజాల పార్టీలో ఏచూరి కొనసాగినా..వ్యక్తిగతంగా ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. పలు జాతీయ అంశాలపై పరస్పరం చర్చించుకునే వారమన్నారు. ఏచూరి కుటుంబసభ్యులకు వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశానికి తీవ్రనష్టం: తమ్మినేని
మతోన్మాదం పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి దేశానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాలు కీలకంగా మారిన సమయంలో ఆయన మృతి బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లా సీపీఎం కార్యాలయంలో గురువారం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఏచూరి మృతికి తెలంగాణ రాష్ట్ర సీపీఎం కమిటీ తరఫున తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు కూనంనేని
ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ‘విద్యావేత్తగా ఉన్న ఏచూరి సీపీఎంలో చేరి క్రియాశీలంగా నిలిచారు. అనేక ప్రజా, కార్మికోద్యమాలను నాయకత్వం వహించారు. దేశం బలమైన నాయకుడిని కోల్పోయింది’ అని కూనంనేని పేర్కొన్నారు.
జేఎన్‌యూలో ఏచూరి నాకు సీనియర్ హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఏచూరి మృతి పట్ల హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సంతాపం తెలిపారు. 1977-81లో జేఎన్‌యూలో చదివేటప్పుడు తనకు ఏచూరి సీనియర్ అని, అప్పుడు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. ఎస్‌ఎ్‌ఫఐ నాయకుడిగా విద్యార్థి ఉద్యమాలలోనూ, సీపీఎం విప్లవ రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతూ పేద ప్రజల సమస్యలపై పోరాటాలు చేశారని గుర్తుచేశారు. తాము ఆయనను ప్రేమతో ‘సీతా’ అని సంబోధించే వాళ్లమన్నారు.