Tupran: 2 లారీల ఢీ.. ఐదుగురి మృతి..
ABN , Publish Date - Jun 29 , 2024 | 03:42 AM
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపా్‌సరోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా గృహ, బుర్హా, గుడువా గ్రామాలకు చెందిన మేకల వ్యాపారులు, కూలీలు..
ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే యత్నంలో మేకల లోడ్ లారీ ఢీ
తూప్రాన్, జూన్ 28: రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపా్‌సరోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా గృహ, బుర్హా, గుడువా గ్రామాలకు చెందిన మేకల వ్యాపారులు, కూలీలు.. డ్రైవర్‌తో కలిపి మొత్తంగా పది మంది హైదరాబాద్‌లోని మేకల మండీకి మేకలను తీసుకెళ్లేందుకు గురువారం సాయంత్రం లారీని కిరాయికి మాట్లాడుకున్నారు. సుమారు 450 మేకలతో వారు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి లారీలో బయలుదేరారు. క్యాబిన్‌లో డ్రైవర్ పక్కన ఇద్దరు వ్యాపారులు కూర్చున్నారు. వెనుక రెండు ర్యాకుల్లో మేకలను నిల్చోబెట్టారు. వాహనం కుదుపులకు గురైతే ఒకదానిపై మరొకటి పడకుండా చూసేందుకు వ్యాపారులు, కూలీలు కలిపి ఏడుగురు ఎక్కారు.
లారీ శుక్రవారం ఉదయం 4:30 గంటలకు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం 44వ జాతీయ రహదారి బైపా్‌సలో ప్రమాదానికి గురైంది. గోధుమల లోడ్‌తో వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసేక్రమంలో వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో మేకల లోడ్‌తో వెళుతున్న లారీ క్యాబిన్‌లో కూర్చున్న వ్యాపారులు చిక్వా రాజు (57), మనీశ్ కుమార్ (30) అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూలీల్లో ఎండీ ఇబ్రహీం (21), ఎండీ షబ్బీర్ ఖాన్ (48), ఎండీ జీసన్ (21) మేకలు మీద పడి, వాటి మధ్య ఇరుక్కొని ప్రాణాలొదిలారు. మేకల వ్యాపారులు రమేశ్ (40), మహేశ్ (35), మణిలాల్ (54), కూలీలు శుక్లాల్ (45), మహారాష్ట్ర నాగ్‌పూర్ జిల్లా టేకెన్ తనారికి చెందిన లారీ డ్రైవర్ బుట్టాసింగ్ (45) గాయపడ్డారు. ఈ ప్రమాదంలో లారీలోని 200 మేకలు మృతిచెందాయి.