Weather Impact: రాజధానిని కమ్మేసిన ముసురు
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:47 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్ర రాజధానిలో తీవ్రంగా కనిపించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది.
హైదరాబాద్‌లో రోజంతా చిరుజల్లులు
మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి!.. బంగాళాఖాతంలో బలహీన పడిన అల్పపీడనం
హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్ర రాజధానిలో తీవ్రంగా కనిపించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరాన్ని ముసురు కమ్మేసింది. చిరుజల్లులు, వానతో వర్షాకాలం నాటి వాతావరణం కనిపించింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మేడ్చల్‌లో గురువారం 4.8 మిల్లీమీటర్ల వర్షం కురువగా అల్వాల్‌లో 2.8 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఇక, రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో హైదరాబాద్‌లో చలి తీవ్రత తగ్గి రాత్రిళ్లు 20 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం 23 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వగా 20.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్ పరిసరాల్లో మరో రెండు రోజుల పాటు చిరుజల్లులు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని, ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని విశాపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.