Madigadda Barrage: మేడిగడ్డ ముంపుపై రీసర్వే చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2024 | 04:29 AM
మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములను రీసర్వే చేసి పరిహారం అందించాలని ఆ రాష్ట్ర రైతులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
మహారాష్ట్రలో రైతుల రిలే దీక్షలు
నష్ట పరిహారంపై స్పష్టతనివ్వాలని డిమాండ్
మహదేవపూర్ రూరల్, అక్టోబరు 7: మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములను రీసర్వే చేసి పరిహారం అందించాలని ఆ రాష్ట్ర రైతులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచాలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం రిలే దీక్షలు ప్రారంభించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముంపునకు గురయ్యే భూములను తక్కువగా చూపిస్తూ పరిహారం చెల్లించాలని యత్నించిందని విమర్శించారు. భూములను రీసర్వే చేయాలని సంవత్సరం క్రితం తాము రిలే దీక్షలు చేపట్టినట్లు తెలిపారు.
అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం తమ నిరసనను పట్టించుకోకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వమే 138 హెక్టార్లకు పరిహారం చెల్లించిందని, ముంపునకు గురయ్యే మరో 400 ఎకరాల భూములను రీసర్వే చేయించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా బ్యారేజీ వల్ల ముంపునకు గురయ్యే భూములను రీసర్వే చేయించి పరిహారం ఇప్పించాలని కోరారు. ముంపు సర్వేతో పాటు నష్టపరిహారంపై స్పష్టతనిచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.