Cyber Crime:సెక్స్‌టార్షన్, డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:23 AM
రోజుకో కొత్తరకం మోసంతో అమాయకులను బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా 319 కేసులు, తెలంగాణలో 45
రాష్ట్రంలో బాధితుల నుంచి రూ. 7 కోట్లు కాజేత
రంగంలోకి సైబర్‌క్రైమ్ బృందాలు... 3 రాష్ట్రాలు గాలించి పట్టివేత
రూ. 5 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, హార్డ్‌డిస్కులు స్వాధీనం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రోజుకో కొత్తరకం మోసంతో అమాయకులను బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 319 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. తెలంగాణలో వీరిపై 45 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 5 లక్షల నగదు, 26 సెల్‌ఫోన్‌లు, 16 ఏటీఎం కార్డులు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి... కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించి పట్టుకున్నాయి.
వారి ఖాతాల్లో ఉన్న రూ. 1.61 కోట్లు ఫ్రీజ్ చేశాయి. నేరగాళ్లు డిజిటల్ మోసాలు, సెక్స్‌టార్షన్(మార్ఫింగ్ చేసి బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం వంటివి), ఓటీపీ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ మోసాలు వంటి పలు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, తెలంగాణలో ఈ తరహాలోనే బాధితుల నుంచి రూ. 6.94 కోట్లు కాజేశారని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ నేరగాళ్లపై నిఘా ఉంచి మాటువేసి పట్టుకున్నామని తెలిపారు. నిందితులను మరోసారి విచారిస్తే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు? ముఠా వెనుక ఎవరున్నారు? వంటి కీలక విషయాలు బయటికొస్తాయని చెప్పారు. త్వరలోనే బాఽధితుల డబ్బు తిరిగి జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పలువురు అధికారుల్ని సీపీ అభినందించారు.