Share News

దేశ నిర్మాణంలో పీవీ పాత్ర కీలకం

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:28 AM

దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది కీలక పాత్ర అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని గుర్తు చేశారు.

దేశ నిర్మాణంలో పీవీ పాత్ర కీలకం

  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

  • దేశాన్ని సంక్షోభం నుంచి ప్రగతి వైపు మళ్లించిన తెలంగాణ ముద్దుబిడ్డ: సీఎం

  • పీవీ తెలంగాణలో పుట్టడం అదృష్టం: భట్టి

  • పీవీ వర్ధంతి సందర్భంగా జ్ఞానభూమిలో మంత్రులు, వివిధ పార్టీల నేతల నివాళులు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది కీలక పాత్ర అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని గుర్తు చేశారు. పీవీ సాహసోపేతమైన ఆర్థిక సరళీకరణ విధానం మధ్య తరగతి వృద్ధి, సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఆయన పాలనలో మధ్య తరగతి రూపురేఖలను మార్చేశారని పేర్కొన్నారు. సోమవారం పీవీ వర్ధంతి సందర్భంగా పార్టీ చీఫ్‌ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నివాళుర్పించాయి. ఆయన సేవలను గుర్తు చేసుకున్నాయి. ‘సంక్షోభం నుండి సమున్నత శిఖరాలకు.. భారత ప్రస్థానానికి బాటలు వేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. పీవీ నరసింహారావుకు ఘన నివాళి’ అని సీఎం ఎక్స్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇటు నెక్లెస్‌ రోడ్డు పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమిలో మంత్రులు, కాంగ్రెస్‌, వివిధ పార్టీల నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు.


పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం అందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన అనేక సంస్కరణలు ఇప్పటికీ రాష్ట్ర పాలనలో ఉపయోగపడుతున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి గ్లోబలైజేషన్‌, లిబరలైజేషన్‌ వంటి కార్యక్రమాలతో దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకువెళ్లారని చెప్పారు. పీవీ అందరివాడని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌ ముద్దుబిడ్డ పీవీ.. ఒక మారుమూల గ్రామంలో జన్మించి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ఘనుడని కొనియాడారు. దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన వ్యక్తి పీవీ అని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు. ఎకరా, రెండెకరాలున్న పేదలు కూడా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారంటే అది పీవీ చలవేనని.. ఆయన తెచ్చిన భూసంస్కరణల వల్లే అది సాధ్యమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆనాడు కేంద్ర మానవ వనరుల మంత్రిగా పీవీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే విద్యావ్యవస్థ ప్రణాళికాబద్ధంగా నడుస్తోందని చెప్పారు.


పీవీవి విశేష సేవలు: కిషన్‌రెడ్డి

పీవీ దేశానికి విశేష సేవలు అందించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనేక రకాల ఆర్థిక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయనకు ఘన నివాళులన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీవీకి దేశంలోనే అతి పెద్ద పురస్కారం ప్రకటించి.. ఆయన చరిత్రను ముందుకు తీసుకువెళ్లారని చెప్పారు. పీవీకి నివాళులర్పించిన వారిలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, మాజీ ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బండా ప్రకాశ్‌, పీవీ కుటుంబ సభ్యులు, అభిమానులు ఉన్నారు.


అసెంబ్లీ లాంజ్‌లో.. గాంధీభవన్‌లో..

అసెంబ్లీలోని మెంబర్స్‌ లాంజ్‌లో పీవీకి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళిని అర్పించారు. పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఇందులో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీజేఎస్‌ ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గాంధీభవన్‌లో పీవీ చిత్రపటానికి టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు తదితరులు నివాళులర్పించారు.

Updated Date - Dec 24 , 2024 | 04:28 AM