Share News

Hyderabad: త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ!

ABN , Publish Date - Jun 20 , 2024 | 04:09 AM

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్తు విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని.. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు.

Hyderabad: త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ!

  • త్వరలో తీసుకొస్తాం.. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది.. రెప్పపాటు కూడా కోతలు లేవు

  • పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా సరఫరాకు ఇబ్బంది లేదు

  • బ్యాంకర్లకు మానవీయ దృక్పథం లేకపోతే చాలా నష్టం

  • బలహీనవర్గాలకు రుణాలిస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యం

  • సబ్సిడీల్లో వాటా ఇస్తున్నా బ్యాంకర్లు సహకరించట్లే

  • రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

  • ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి పనిచేయాలి: తుమ్మల

  • 6,33,777 కోట్లు 2024-25

    సంవత్సరానికి బ్యాంకర్ల రుణ ప్రణాళిక

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్తు విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని.. పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామికరంగాల అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడుతోందని.. యావత్‌ ప్రపంచానికీ రాష్ట్రంపెట్టుబడుల స్వర్గధామంగా మారిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ సమావేశంలో భట్టి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ దృక్పథం ఉండాలని.. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాక నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు కూడా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని, బలహీనవర్గాలకు విరివిగా రుణాలిస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని భట్టి స్పష్టం చేశారు.


ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తామని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఎక్కువ రుణాలిస్తే అత్యధిక జనాభాకు ఉపాధి దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. రాయితీ పథకాలకు సంబంధించి ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తున్నా బ్యాంకర్లు సహకరించట్లేదని, సబ్సిడీ విడుదల చేయటంలేదని, ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతోందో అర్థం కావట్లేదని భట్టి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేటు బ్యాంకుల పురోగతి బాగుండగా, జాతీయ బ్యాంకులు వెనకంజలో ఉంటున్నాయని, శాఖలు తగ్గించడం సరైన చర్య కాదని అన్నారు. ప్రజలు ఎక్కువగా ప్రైవేటు బ్యాంకుల వైపు మొగ్గుచూపుతున్నారన్న మంత్రి.. జాతీయ, గ్రామీణ బ్యాంకులు బ్రాండ్‌ ఇమేజ్‌ను ప్రచారం చేసుకోవాలని సూచించారు. రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని.. బ్యాంకర్లు పెద్దఎత్తున రుణాలివ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భట్టి భరోసా ఇచ్చారు.

సానుకూలత ఉండాలి..

తెలంగాణ పదేళ్ల వయస్సున్న చిన్న రాష్ట్రమని, రాష్ట్రం పట్ల బ్యాంకర్లకు సానుకూలత ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి బ్యాంకర్లు పనులు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు ఇస్తున్న రుణాలు సరిపోవట్లేదని, రుణాలు అధికంగా ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకుల శాఖలు 6,415 ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 శాఖలే ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడాలని కోరారు. వ్యవసాయ రంగానికి నిరుటి కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరుచేసినప్పటికీ అందులో చిన్న, సన్నకారు రైతుల వాటా అనుకున్నంత లేదని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో 73.11శాతం భూములు చిన్న, సన్నకారు రైతుల ఆధీనంలోనే ఉన్నాయని.. ఆర్‌బీఐ విధించిన పరిమితికే పరిమితం కాకుండా... ఈ వర్గాలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. వ్యవసాయరంగంలో మౌలిక వసతులకు ఇచ్చే రుణాలు 29.29 శాతమే ఉన్నాయని.. అవి 100 శాతానికి పెరగాలని అన్నారు.


పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు ప్రభుత్వానికి పక్కాగా ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని వారు కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన ఆయిల్‌పామ్‌ సాగుకు బ్యాంకుల నుంచి ప్రోత్సాహంలేదని తుమ్మల ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కొత్తగా 59,261 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగులోకి తెచ్చామని, కేంద్రం రూ.221 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని, 18,654 మంది రైతులు ఈ పంట సాగుచేస్తే... బ్యాంకర్లు 50 శాతానికంటే తక్కువ మందికే రుణాలిచ్చారని తుమ్మల ఆందోళన వ్యక్తంచేశారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు, డ్రిప్‌ పై 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని.. రెండు, మూడు రోజుల్లో రూ.100.76 కోట్ల సబ్సిడీని డ్రిప్‌ కంపెనీలకు, రైతులకు చెల్లిస్తామని తెలిపారు. ఆహార ఫార్కులు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు రుణాలు ఇవ్వటంలేదని, బుగ్గపాడు ఫుడ్‌ పార్కుకు ఇచ్చినట్లుగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు మంత్రి సూచించారు. రైతులకు ఇన్‌పుట్స్‌, ఫైనాన్స్‌ అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే.. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సెక్టార్‌లోని వారు ఎందుకు స్పందించటంలేదని, ఆత్మవిమర్శ చేసుకోవాలని తుమ్మల వ్యాఖ్యానించారు.


పెరిగిన రుణప్రణాళిక..

2024-25 సంవత్సరానికిగాను బ్యాంకర్ల రుణ ప్రణాళిక అమాంతం పెరిగింది. ఈ వార్షిక సంవత్సరంలో ఏకంగా రూ.6,33,777 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని బ్యాంకర్ల కమిటీ బుధవారం విడుదలచేసిన ప్రణాళికలో వెల్లడించింది. 2023-24 రుణ ప్రణాళిక రూ.2,42,775 కోట్లు ఉండగా... ఈసారి అది ఏకంగా 161 శాతం మేర పెరిగింది. ఇందులో ప్రాధాన్య రంగాలకు రూ.2,80,551 కోట్లు, వ్యవసాయానికి రూ.1,34,138 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.28,223 కోట్లు, గృహనిర్మాణానికి రూ.10,768 కోట్లు కేటాయించారు.

Updated Date - Jun 20 , 2024 | 04:09 AM