Share News

Hyderabad: భార్య మీద కోపం పోర్షే కారు మీద చూపించాడు

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:48 AM

పండగపూట భార్యతో తగాదా పడిన ఓ వ్యక్తి... తన ఆగ్రహవేశాల్ని కారు నడపటంలో చూపించాడు. కట్టలు తెంచుకుంటున్న ఆవేశాన్ని ఆపుకోలేక మితిమీరిన వేగంతో వాహనం నడిపాడు.

Hyderabad: భార్య మీద కోపం పోర్షే కారు మీద చూపించాడు

  • ఆగ్రహంతో అతి వేగంగా నడిపి యాక్సిడెంట్‌

బంజారాహిల్స్‌, నవంబరు 1 (ఆంద్రజ్యోతి): పండగపూట భార్యతో తగాదా పడిన ఓ వ్యక్తి... తన ఆగ్రహవేశాల్ని కారు నడపటంలో చూపించాడు. కట్టలు తెంచుకుంటున్న ఆవేశాన్ని ఆపుకోలేక మితిమీరిన వేగంతో వాహనం నడిపాడు. అలాగే రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. చివరికి కారు అదుపు తప్పడంతో కేబీఆర్‌ పార్కు ప్రహరీని ఢీకొట్టాడు. బెలూన్‌లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పరిధిలో జరిగింది. ఇక్కడి రోడ్డు నెంబరు 6లో నివసించే ఉత్సవ్‌ దీక్షిత్‌ అనే పారిశ్రామివేత్త... దీపావళి రోజున భార్యతో గొడవ పడ్డాడు. పట్టరాని కోపంతో తన పోర్షే కారును బయటకు తీసి రాత్రంతా రోడ్లపై తిరిగాడు.


శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు నెంబరు 12 వద్ద బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వైపు వాహనాన్ని మళ్లించాడు. కొద్దిదూరం రాగానే వేగంగా ఉన్న కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న డివైడర్‌ను ఎక్కి గాల్లో లేచి కేబీఆర్‌ ప్రహరీని ఢీ కొడుతూ అక్కడే ఉన్న చెట్టు కొట్టి ఆగిపోయింది. సమయానికి కారులో బెలూన్‌లు తెరుచుకోవడంతో దీక్షిత్‌ సురక్షితంగా బయటపడ్డాడు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కారు వేగానికి కేబీఆర్‌ పార్కు ప్రహరీకి ఉన్న చిన్న గేటు ఎగిరి ఫర్లాంగ్‌ దూరంలో పడింది. కారు చెట్టుకు ఢీకొని ఉండకపోతే వాకర్ల మీదకి వెళ్లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 05:48 AM