Share News

Maoist Commander: ఇన్‌ఫార్మర్‌ పేరిట మహిళా మావోయిస్టు హత్య

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:52 AM

మావోయిస్టు పార్టీలో గత ఆరేళ్లుగా పని చేస్తున్న బంటి రాధ (25) అలియాస్‌ నీల్సో అనే మహిళా మావోయిస్టు (కమాండర్‌)ను బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు హత్య చేశారు.

Maoist Commander: ఇన్‌ఫార్మర్‌ పేరిట మహిళా మావోయిస్టు హత్య

  • మృతదేహాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన మావోయిస్టులు

  • పార్టీకి ద్రోహం చేసినందుకే శిక్షించామని లేఖ

  • గొంతు నులిమి చంపినట్లు అనుమానం.. భద్రాద్రిలో ఘటన

  • మృతురాలి స్వస్థలం హైదరాబాద్‌

చర్ల/పినపాక, జవహర్‌నగర్‌, కాప్రా, ఆగస్టు 21: మావోయిస్టు పార్టీలో గత ఆరేళ్లుగా పని చేస్తున్న బంటి రాధ (25) అలియాస్‌ నీల్సో అనే మహిళా మావోయిస్టు (కమాండర్‌)ను బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం రహదారిపై పడేశారు. మృతదేహంపై లభించిన ఆనవాళ్ల ప్రకారం ఆమెను గొంతు నులి మి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.


ఇన్‌ఫార్మర్‌గా వ్యవరిస్తున్నందుకే హత్య చేశామని ఆంధ్రా-ఒడిసా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ పేరిట లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బాలాజీనగర్‌ కు చెందిన బంటి రాధ డీఎంఎల్‌టీ (డిప్లొమా ఇన్‌ మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ) పూర్తి చేసి 2018లో మావోయిస్టు పార్టీలో చేరింది. గడిచిన ఆరేళ్లలో ఆంధ్రా, ఒడిసా బోర్డర్‌లో పార్టీ సభ్యురాలిగా, జోన్‌ మిలటరీ ఇన్‌స్పెక్టర్‌గా, దళ కమాండర్‌గా పని చేసింది. ఈ ఎదుగుదలతో పాటు కొన్ని బలహీనత లు కూడా ఆమె కలిగి ఉందని మావోయిస్టులు లేఖ లో పేర్కొన్నారు. క్రమశిక్షణతో వ్యవహరించకపోవ డం, నిజాయితీగా ఉండకపోవడం, పార్టీని పక్కదారి పట్టించడం వంటి చర్యలకు పాల్పడటంతో మూడు నెలల క్రితం ఆమెను కమాండర్‌ బాధ్యతల నుంచి పార్టీ సస్పెండ్‌ చేసిందని పేర్కొన్నారు.


ఈ క్రమంలో నే రాధను పార్టీ నుంచి బటయటకు తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులపై పోలీసులు ఒత్తిడి చేశారని తెలిపారు. రాధ తమ్ముడు సూర్యానికి ఉద్యోగం, డబ్బులు, విలాసవంతమైన జీవితం ఆశ చూపారని, ఫలితంగా అతడు ఏజెంట్‌గా మారాడని ఆరోపించారు. అప్పటి నుంచి తను ఇంటెలిజెన్స్‌ విభాంగలో పనిచేస్తూ కొందరితో బృందంగా ఏర్పడి, దళాల సమాచారం పోలీసులకు చేరవేస్తున్నాడని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం రాధ ఫోన్‌ నంబర్‌ తెలుసుకున్న పోలీసులు తన స్నేహితురాలి ద్వారా ఆమె ను ఉద్యమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.


ఆమె అంగీకరించకపోవడంతో కుటుంబసభ్యులను జైల్లో పెడతామని పోలీసులు బెదిరించారని పేర్కొన్నారు. రాధ తమ్ము డు సూర్యం ద్వారా ఫోన్‌ చేయించి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, తల్లి అనారోగ్య సమస్యలు చెప్పి, ఉద్యమం నుంచి బయటకు రావాలని లేదంటే పార్టీ సమాచారం ఇస్తే కుటుంబసమస్యలు తీరతాయని చెప్పారని పేర్కొన్నారు. అందుకు ఆమె అంగీకరించి.. అప్పటి నుంచి పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులకు అందిస్తోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు.


కాగా రాధ మృతదేహాన్ని మా వోయిస్టులు రహదారిపై పడేయడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. చర్ల సీఐ రాజు వర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తొలుత చర్లకు, అక్కడి నుంచి భద్రాచలం వైద్యశాలకు తరలించి పంచనామా నిర్వహించారు. కాగా ఐదు రోజుల క్రితం రాజు అనే కమాండర్‌ను కూడా మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేశారు. కాగా మావోయిస్టులు తోటి దళ సభ్యురాలు రాధను హత్య చేయడాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌ ఖండించారు. దళిత మహిళను కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని మండిపడ్డారు.


కూతురు మృతదేహం తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు భద్రాచలం వెళ్లారు. రాధ అంత్యక్రియలు కాప్రాలోనే జరుగుతాయని వారి బంధువులు చెప్పారు. కాగా రాధ తల్లిదండ్రులైన బాలయ్య-పోచమ్మ స్వస్థలం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామం. ఇరవై ఏళ్ల క్రితమే కాప్రాలోని ఇందిరానగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. బాలయ్య ఆటో నడుపుతన్నాడు. పోచమ్మ కూలీ పనులకు వెళుతోంది. డీఎంఎల్‌టీ కోర్సు చదివే క్రమంలోనే రాధ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితురాలైంది. 2018లో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు అప్పట్లోనే పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 22 , 2024 | 03:52 AM