Chanchalguda Jail: జైళ్లలో మా హక్కులను హరించొద్దు
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:20 AM
జైళ్లలో తమ హక్కులను హరించొద్దని మావోయిస్టు ఖైదీలు డిమాండ్ చేశారు.
చంచల్‌గూడ జైల్లో మావోయిస్టు ఖైదీల నిరాహారదీక్ష..!
సైదాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జైళ్లలో తమ హక్కులను హరించొద్దని మావోయిస్టు ఖైదీలు డిమాండ్ చేశారు. తమ హక్కులను, ప్రాథమిక స్వేచ్ఛను కాపాడాలంటూ చంచల్‌గూడ జైలులో మావోయిస్టు ఖైదీలు అమితాబ్ బాగ్నీ, గంగాధర్, రాజ్‌కుమార్ ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టి తమ డిమాండ్లను అమలు చేయాలని జైలు అధికారులను కోరారు. మావోయిస్టు ఖైదీలను ఒంటరిగా లాక్‌పలో పెట్టి వేధించడం న్యాయస్థానాల ఉల్లంఘనే అవుతుందని, తక్షణమే వారికి ప్రత్యేక కిచెన్, బ్యారక్‌ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాకప్ తెరిచి, లైబ్రరీలో పుస్తకాలు, దినపత్రికలు, పెన్నులు, పేపర్లు అందుబాటులో ఉంచాలని, ఉదయం వాకింగ్ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నాణ్యమైన ఆహారం, వైద్యం అందించాలని, ములాఖత్‌లకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని విన్నవించారు. మావోయిస్టు హక్కులను కాలరాస్తున్న జైలు అధికారులపై ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.