Share News

Marking Process: పెండింగ్‌లో 262 ఇళ్ల మార్కింగ్‌

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:38 AM

మూసీ నదీగర్భం (రివర్‌బెడ్‌)లో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించిన మార్కింగ్‌ ప్రక్రియ మూడో రోజు కూడా నిలిచిపోయింది.

Marking Process: పెండింగ్‌లో 262 ఇళ్ల మార్కింగ్‌

  • నాంపల్లి, బహదూర్‌పురాలో బాధితుల నుంచి నిరసనలు

  • జియాగూడ, పిల్లిగుడిసెల్లోని ఇళ్లకు ఇప్పటిదాకా 129 కుటుంబాలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మూసీ నదీగర్భం (రివర్‌బెడ్‌)లో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించిన మార్కింగ్‌ ప్రక్రియ మూడో రోజు కూడా నిలిచిపోయింది. మూసీ రివర్‌బెడ్‌లో నివనిస్తున్న కుటుంబాల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు మార్కింగ్‌ పూర్తిచేసిన చోట కొంతమంది డబుల్‌ బెడ్‌రూమ్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారిని నెమ్మదిగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలో నదీ పరీవాహకంలో మొత్తం 1,595 నిర్మాణాలను గతంలో డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించారు. ఇప్పటివరకు 1,333 ఇళ్లకు మార్కింగ్‌ చేశారు.


నాంపల్లి, బహదూర్‌పురా మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు రావడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆయా చోట్ల 262 ఇళ్లకు మార్కింగ్‌ చేయాల్సి ఉందని హైదరాబాద్‌ ఆర్డీవో మహిపాల్‌ తెలిపారు. ఇక డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలోకి తరలేందుకు మొగ్గుచూపుతున్న వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపిస్తున్నారు. ఆదివారం వరకు 85 మందిని జియాగూడ, మలక్‌పేట్‌ నియోజకవర్గం పిల్లిగుడిసెలలోని రెండు పడకల గృహ సముదాయానికి తరలించారు. సోమవారం మరో 54 మందిని తరలించారు. ఇందులో నాలుగు కుటుంబాలు జియాగూడకు వెళ్లగా.. 50 కుటుంబాలు పిల్లిగుడిసెల ప్రాంతానికి వెళ్లాయి.


కాగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో తాగునీరు, విద్యుత్తు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మూసీ నిర్వాసితులను డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలించడంలో భాగంగా నిర్వాసితు లతో హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ స్వయంగా కలుసుకొని మాట్లాడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు మూసీ ప్రాంతంలో ఉంటే ఇబ్బందులు వస్తాయని, పిల్లలు అనారోగ్యం బారిన పడుతారని అవగాహన కల్పిస్తున్నారు. మూసీ సుందరీకరణపై ప్రభుత్వ లక్ష్యాన్ని తెలియజేస్తుండటంతో చాలామంది ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 01 , 2024 | 03:39 AM