Sridhar Babu: రాష్ట్రంలో మరిన్ని మ్యారియట్ హోటల్స్
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:47 AM
అమెరికా ప్రధాన కేంద్రంగా 141 దేశాల్లో విస్తరించి.. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీగా ఉన్న మ్యారియట్.. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది.
ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటుకు ప్లాన్
హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
సీఎం రేవంత్‌తో హోటల్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): అమెరికా ప్రధాన కేంద్రంగా 141 దేశాల్లో విస్తరించి.. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీగా ఉన్న మ్యారియట్.. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ హోటళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మ్యారియట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డ్రూ పింటో నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధుల బృందం గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏఐ సిటీలో హోటల్ నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నామని కంపెనీ తెలిపింది. సీఎంతో భేటీ అనంతరం మ్యారియట్ బృందం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఆ వివరాలను మంత్రి మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ఆతిథ్య రంగానికి సంబంధించిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను మ్యారియట్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. ఈ కేంద్రం వచ్చే ఏడాది మార్చిలోగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. మొదటి దశలో 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
గ్రీన్ ఫార్మా సిటీలో కాలుష్యం ఉండదు..
తాము ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీ పూర్తి పర్యావరణహితంగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసలు కాలుష్యమే వెలువడని(జీరో పొల్యూషన్) పరిశ్రమలు ఉంటాయని చెప్పారు. కొద్దిపాటి రసాయన వ్యర్థాలు ఉత్పత్తి అయినా.. ఆయా కంపెనీలే ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేస్తాయని వెల్లడించారు. మరో పది రోజుల్లో ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చేది తెలుస్తుందని అన్నారు. ఫార్మా సిటీలో హోటల్స్, విద్యా సంస్థలు, గృహోపకరణాల తయారీ కంపెనీలు, వినోద రంగ సంస్థలు కూడా ఉంటాయని శ్రీధర్‌బాబు తెలిపారు.