Hyderabad: పోదామా.. పదేళ్ల తెలంగాణ ఉత్సవానికి!
ABN , Publish Date - May 30 , 2024 | 03:51 AM
ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం! జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు నిండుతాయి! పదేళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే జరుగుతాయి.
జూన్2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు
ప్రధానోత్సవం పరేడ్ గ్రౌండ్‌లో.. సోనియా, రేవంత్ హాజరు
హైదరాబాద్, అడ్డగుట్ట, మే 29 (ఆంధ్రజ్యోతి): ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు మరింత ప్రత్యేకం! జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు నిండుతాయి! పదేళ్ల పండుగ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రస్థాయి ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే జరుగుతాయి. అలాగే అన్ని జిల్లాలు, గ్రామాల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్లు, క్షేత్ర స్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని సూచించింది. పదేళ్ల పండుగ విశిష్టతను తెలిపేలా ట్యాంక్‌బండ్‌లో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.
సీఎం రేవంత్‌రెడ్డి, సోనియా గాంధీ, రాష్ట్రమంత్రులు , ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నందున గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న ఉదయం ముఖ్యమంత్రి గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ సీఎం జాతీయ పతాకాన్ని ఎగురవేసి, రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దానికనుగుణంగా భారీ షామియానాలు, ఇతర ఏర్పాటు చేస్తున్నారు. ఎండలతో ఉత్సవానికి హాజరయ్యే ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యాలు, టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలు మొదలుకొని... మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఇతర జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మండల పరిషత్ అధ్యక్షులు, అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించింది.