Share News

BJP: ప్రజలు చనిపోతుంటే ఢిల్లీలో ఏం పని.. కాంగ్రెస్‌పై మండిపడ్డ రఘునందన్‌

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:46 PM

రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు.

BJP: ప్రజలు చనిపోతుంటే ఢిల్లీలో ఏం పని.. కాంగ్రెస్‌పై మండిపడ్డ రఘునందన్‌

సిద్దిపేట: రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు. సిద్దిపేట శివారులోని జిల్లా బీజేపీ(BJP) కార్యాలయంలో రఘునందన్ రావు ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకీ డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డెంగీ, మలేరియా, సీజనల్ వ్యాధుల రోగులతో నిండిన ఆసుపత్రులను సందర్శించాలని డిమాండ్ చేశారు. వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీసి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. "రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్తున్నారు. సీజనల్ వ్యాధుల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించి ఆసుపత్రులను సందర్శించాలి. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం హైడ్రా పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తోంది. రోగులు కిక్కిరిసిన ఆసుపత్రుల్లో వెంటనే తగినంత సిబ్బందిని కేటాయించాలి" అని రఘునందన్ డిమాండ్ చేశారు.


పంచాయతీ ఎన్నికలపై..

రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రామాను అందరూ గమనిస్తున్నారని.. ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చెరువులు కబ్జా చేసిన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Aug 25 , 2024 | 03:47 PM