Share News

KTR: ఆంధ్రోళ్ల బూట్లు నాకి.. పార్టీలు మారిన రేవంత్‌: కేటీఆర్

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:01 AM

‘‘అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చున్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి నాపై పదే పదే విమర్శలు చేస్తున్నాడు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్‌ పట్ల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన విమర్శలకు నేనూ సమాధానం చెప్పదల్చుకున్నా. రేవంత్‌రెడ్డి లాగా ఆంధ్రోళ్ల బూట్లు నాకి, సంచులు మోసి, పార్టీలు మారి.. నేను రాజకీయాల్లోకి రాలే.’’

KTR: ఆంధ్రోళ్ల బూట్లు నాకి.. పార్టీలు మారిన రేవంత్‌: కేటీఆర్

నేను ఆయనలా రాజకీయాల్లోకి రాలేదు

ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ కొడుకుగా వచ్చా

సిరిసిల్ల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా

హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌ పని పడతాం

కోడ్‌కు ముందే ధాన్యానికి 500బోనస్‌ ఇవ్వాలి

కాంగ్రెస్‌లోనే మానవ బాంబులు ఉన్నాయి

రేవంత్‌ రెడ్డి కాదు.. పొంగనాల పోతిరెడ్డి

కామారెడ్డి, గంభీరావుపేట బీఆర్‌ఎస్‌

కార్యకర్తల విస్తృత స్థాయి భేటీలో కేటీఆర్‌

కేటీఆర్‌ సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు

కామారెడ్డి/సిరిసిల్ల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘‘అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చున్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి నాపై పదే పదే విమర్శలు చేస్తున్నాడు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్‌ పట్ల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన విమర్శలకు నేనూ సమాధానం చెప్పదల్చుకున్నా. రేవంత్‌రెడ్డి లాగా ఆంధ్రోళ్ల బూట్లు నాకి, సంచులు మోసి, పార్టీలు మారి.. నేను రాజకీయాల్లోకి రాలే. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ కొడుకుగా వచ్చా. సిరిసిల్ల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచే వాడే మగోడా? ఓడినవాడు కాదా? అట్లైతే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఇద్దరం పోటీ చేద్దామని, ఎవరు మగాడో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. కామారెడ్డిలో ఆదివారం బీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్‌ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వడం మానేసి.. మేడిగడ్డ పిల్లర్లు కుంగాయంటూ కాంగ్రెస్‌ రాజకీయ పబ్బం గడుపుతోందన్నారు. రేవంత్‌రెడ్డికి ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా ఎన్నికల కోడ్‌ రాకముందే ఆడ బిడ్డలకు రూ.2500, పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌ నుంచే ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వడంతోపాటు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలన్నారు. మార్చి 15వ తేదీ వరకూ ఓపికగా ఉంటామని, అప్పటికీ హామీలు అమలుచేయకపోతే కాంగ్రెస్‌ భరతం పడతామని హెచ్చరించారు. 39 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించి ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇచ్చారన్నారు. ప్రజల తీర్పును తాము స్వీకరిస్తున్నామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుందా? లేదా? అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

భగ్గుమన్న విభేదాలు

కామారెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కేటీఆర్‌ సమక్షంలోనే నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ ముఖ్యనేత తిర్మల్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పేరు ప్రస్తావించలేదంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. పలువురు నేతలు స్టేజి వద్దకు దూసుకువచ్చి తిర్మల్‌రెడ్డిని నిలదీశారు. మరోవైపు.. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి సెగ్మెంట్‌ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు అప్పగిస్తే బీఆర్‌ఎస్‌కు తాను రాజీనామా చేస్తానని పార్టీ సీనియర్‌ నేత నిట్టు వేణుగోపాల్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనతో పాటు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, మరో ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

మరమ్మతు చేసి సాగునీళ్లివ్వండి

‘ప్రభుత్వాన్ని ఎవరు కూల్చినా మానవబాంబులు అవుతామని రేవంత్‌రెడ్డి అంటున్నాడు.. మానవ బాంబులు కాంగ్రెస్‌లోనే ఉన్నాయి. మెడలో పేగులు వేసుకుంటా.. జేబులో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతున్నా.. లాగులో తొండలు సొర్రగొడుతా’ అనేవి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతు చేసి సాగునీళ్లు ఇవ్వాలన్నారు. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ ఒక్క పనైనా చేశాడా? అని ఆయన ప్రశ్నించారు.

జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ

కాగా జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్యనేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, గెలుపే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, సిటింగ్‌ ఎంపీ పార్టీని వీడటం, ఇతర అంశాలపై పార్టీ నేతలతో కేసీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్‌ పేరును కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం.

Updated Date - Mar 11 , 2024 | 10:01 AM