Andole: నారసింహుడి నుంచి రంగనాథుడి చెంతకు విగ్రహాలు.. 30 ఏళ్ల తరువాత చారిత్రక ఘట్టం
ABN , Publish Date - May 25 , 2024 | 04:15 PM
పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది.
అందోల్: పూజలు నిర్వహించడం, రక్షణ విషయంలో ఇబ్బందిగా మారుతోందని సరిగ్గా 30 ఏళ్ల క్రితం పంచలోహ విగ్రహాలను(Panchaloha Idols) లక్ష్మీ నరసింహ దేవాలయానికి చేరవేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకురావడంతో ఆ పట్టణంలో పండగ వాతావరణం ఏర్పడింది. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అందోల్(Andole) రంగనాథ స్వామి దేవాలయం(Andole Ranganatha Swami Temple) గురించే మనం మాట్లాడుకునేది. అందోల్ పట్టణంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రంగనాథ దేవాలయంలో 1992 వరకు ఉత్సవ విగ్రహాలు ఉండేవి.
ఈ విగ్రహాలకు ప్రతి రోజూ పూజా కార్యక్రమాలు, రక్షణ విషయంలో ఇబ్బందిగా ఉంటుందనే కారణంతో అందోల్‌కి చెందిన పెద్ద మనుషుల సమక్షంలో నాచారంలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ అధికారులకు విగ్రహాలను అప్పగించారు. వాటిలో శ్రీకృష్ణుడు, రుక్మిణీ, సత్యభామ, నాలుగు ఆల్వార్ల విగ్రహాలు తదితర పూజా సామగ్రి ఉన్నాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Raja Narsimha) ఆలయ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చి దిద్దడంతోపాటు, ఆలయ చరిత్రను నియోజకవర్గం మొత్తం చాటి చెప్పేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా కోనేరును శుభ్రం చేయించి తిరిగి వాడకంలోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ని కోట్లైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఇటీవలే ఆలయ ప్రధాన అర్చకుడు చిదిరె శ్యాంనాథ్ శర్మ, అర్చకులతో చెప్పారు. ఇందులో భాగంగా ఆలయంలో ఉత్సవ విగ్రహాల విషయాన్ని తెలుసుకొని వాటిని యథావిధిగా అందోలు రంగనాథ స్వామి దేవాలయానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
అంటే 30 ఏళ్ల తరువాత విగ్రహాలు ఆలయానికి తిరిగి వచ్చాయన్నమాట. ఈనెల 25వ తేదీ నుంచి గుడిలో బ్రహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మే 31న జరగనున్న నూతన రతోత్సవ వేడుకతో ముగియనున్నాయి.
సంతానం సాఫల్యంగా గరుడ ప్రసాదం..
ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా సంతాన సాఫల్యం కోసం ఆలయంలో భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ జరుగుతుందని శ్యాంనాథ్ శర్మ తెలిపారు. ఇది ఎంతో ప్రాచుర్యం పొందిందని, వివిధ జిల్లాలకు చెందిన భక్తులు వందల సంఖ్యలో ప్రసాదం అందుకోవడానికి వస్తారని చెప్పారు.
సంతానం కలగక బాధపడుతున్న దంపతులు మే 26న(ఆదివారం) ఉదయం 10 గంటలకు సంప్రదాయ వస్త్రాలు ధరించి ప్రసాదం పొందేందుకు ఆలయానికి రావాలని సూచించారు.
చారిత్రక నేపథ్యం..
రంగనాథ స్వామి ఆలయంతోపాటు.. అందోల్ ఊరికి కూడా పెద్ద చరిత్రే ఉంది. అందోల్‌లోని రంగనాయకసాగర్ (అందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని నాగిరెడ్డి ఇటీవలే పరిశోధన చేసి తెలిపారు. అందోల్‌లోని రంగనాథాలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు.. రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యుల హయాం క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య చెక్కినవని వెల్లడించారు.
అలాగే చెరువుగట్టున నాగులకట్టపై వెలిసిన చెన్నకేశవ, జనార్దన, నాగదేవతల విగ్రహాలు.. కల్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలం 11-13 శతాబ్దాల మధ్యవని వివరించారు. చెన్నకేశవ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం, శ్రీదేవి, భూదేవి దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యముందన్నారు. ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్ప కళానైపుణ్యానికి అద్దం పడుతున్నాయని చెప్పారు. నాగులకట్టగా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేయవచ్చని చరిత్రకారులు అంటున్నారు.
Andole: అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!
For Latest News and Telangana News click here