Medical Education: అదే సందిగ్ధం!
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:03 AM
వైద్యవిద్య ప్రవేశాలపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి 4 రోజులవుతున్నా... రాష్ట్రంలో ఎంబీబీస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
అధికారుల నిర్లక్ష్య ధోరణే కారణం.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇప్పటికే 4 రోజులు
స్థానికత మార్గదర్శకాల విడుదల జాప్యం.. కౌన్సెలింగ్‌కు ఆఖరి గడువు అక్టోబరు 31
వారానికో రౌండ్ నిర్వహించినా పూర్తి కావడం కష్టమే.. ఆగ్రహంగా విద్యార్థులు
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య ప్రవేశాలపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి 4 రోజులవుతున్నా... రాష్ట్రంలో ఎంబీబీస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సాగదీత ధోరణి కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై సర్కారు ఇచ్చిన జీవో 33పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా.. స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దానిపై రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించాలని, అదే సమయంలో స్థానికతపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచించింది.
ఈ ఆదేశాలపై వైద్య శాఖ ఉన్నతాఽధికారులు న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోగా.. వారు సైతం మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ అంశంపై వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. మరోవైపు.. అక్టోబరు 31వ తేదీలోగా మెడికల్ కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. వారానికి ఒక రౌండ్ చొప్పున కౌన్సెలింగ్ చేపట్టినా.. సమయం సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలన్న దానిపై ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా.. ఒంటెత్తు పోకడలు, అనుభవరాహిత్యం కారణంగా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాలుగు రోజుల సమయం వృథా అయింది.
ఇంకా ఎన్ని రోజుల సమయం తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. నిజానికి ఇటువంటి విషయాల్లో నిపుణులతో కమిటీ వేయడమో, లేదంటే వారితో చర్చించి చకచకా నిర్ణయాలు తీసుకోవడమో చేయాలి. కానీ అన్నీ తమకే తెలుసు అన్న చందంగా ఉన్నతాధికారులు వ్యవహరించడం వల్లే ఈ సమస్య తలెత్తిందనన వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో సీటు వస్తుందన్న ఆశతో చాలా మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాలు, ఆలిండియా కోటాకు దరఖాస్తు కూడా చేయలేదు. ఇక్కడ తీవ్ర జాప్యం నెలకొనడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఒక వేళ ఇక్కడ సీటు రాకుంటే తమకున్న అన్ని రకాల ఆప్షన్స్ మూసుకుపోతాయని, ఎక్కడా చేరే పరిస్థితి ఉండదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించుకొని ఉంటే ఇప్పటికే ఒక రౌండ్ కౌన్సెలింగ్ పూర్తయి ఉండేది.
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లి అనవసరంగా కాలయాపన చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి స్టడీ సర్టిఫికెట్‌తోపాటు ఒకవేళ ఇక్కడ చదవకుంటే విద్యార్థి తల్లిదండ్రులు పదేళ్ల పాటు తెలంగాణలోనే నివాసం ఉన్నారన్న(రెసిడెన్స్) సర్టిఫికెట్ సమర్పించాలన్న నిబంధన పెట్టి ఉంటే గొడవే ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా గుడ్డిగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకరిద్దరు ఉన్నతాధికారులనే నమ్మి, వారిపైనే భారం వేయడంతో సమస్య జటిలమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలకు చెందిన విద్యార్థుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఏపీలోని పలు జిల్లాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఇప్పుడు వారంతా స్థానికులు కాకుండాపోతున్నారు. వారి విషయంలోనూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.