Hyderabad: నిలిచిన వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ!
ABN , Publish Date - Sep 09 , 2024 | 03:03 AM
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.
8 హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు.. నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం
8 సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆశలు
8 అనుకూలంగా వస్తే వెంటనే కౌన్సెలింగ్
8 వ్యతిరేకంగా వస్తే మరింత ఆలస్యం
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణలో శాశ్వత నివాసితులైన విద్యార్థుల స్థానికతను నిర్థారించేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. నిజానికి వీటి రూపకల్పనకు చాలా సమయం తీసుకునే అవకాశంది ఉంది. ఇప్పటికిప్పుడు స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించి, ముందుకెళ్లడం ఇప్పట్లో జరిగే పనికాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే వైద్యవిద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-33 ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రక్రియను కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం పూర్తి చేసింది. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే.. రెండు రోజుల్లోనే మొదటివిడత ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలిగ్ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో ఒకట్రెండ్రోజుల్లో మొదటివిడత సీట్ల భర్తీ ముగియనుంది.
వ్యతిరేక తీర్పు వస్తే ఆలస్యమే?
ఒకవేళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే మాత్రం తెలంగాణ సర్కారు కొత్త కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. హైకోర్టు సూచించినట్లుగానే స్థానికతపై మార్గదర్శకాలు రూపొంచాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాకే.. వాటి ఆధారంగా మార్గదర్శకాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత.. రెవెన్యూ శాఖ ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు స్థానిక ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ధ్రువపత్రాలను విద్యార్థులు వైద్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే.. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పరిణామాలతో.. వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ ఎప్పటికి మొదలవుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొంటాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి.
విద్యార్థుల్లో ఆందోళన..
ఎంబీబీఎస్ ప్రవేశాలు నిలిచిపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోంది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి రెండోవిడత కౌన్సెలింగ్ ముగిసింది. ఈ ఏడాది తీవ్ర జాప్యం నెలకొనడంతో.. మన దగ్గర సీటు రాకుంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్దామనుకునేవారికి ఆ అవకాశం ఉండదు. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్ల కోసం 17,654 మంది తమ పేర్లను రిజిష్ట్రేషన్ చేసుకోగా, యాజమాన్య కోటా, సీ-కేటగిరి కింద మరో 6,468 మంది దరఖాస్తు చేసుకున్నారు.