Share News

Damodara: కొడంగల్‌.. వండర్‌ఫుల్‌!

ABN , Publish Date - Dec 07 , 2024 | 03:16 AM

అన్ని రకాల అభివృద్ధి పనులతో త్వరలో కొడంగల్‌ రూపు రేఖలు మారనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర అన్నారు. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మహర్దశ పట్టిందన్నారు.

Damodara: కొడంగల్‌.. వండర్‌ఫుల్‌!

  • అభివృద్ధి లో నియోజకర్గం ముందుకు

  • ఉమ్మడి పాలమూరుకు మహర్దశ: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర

  • విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి: ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు

  • సాగునీటి ప్రాజెక్టులకు సీఎం రేవంత్‌ పెద్దపీట: జూపల్లి

  • దేశంలోనే పెద్ద అల్పాహార కేంద్రం కొడంగల్‌లో ఏర్పాటు

  • 8మండలాల్లోని 312 బడుల్లో 28వేల విద్యార్థులకు అల్పాహారం

కొడంగల్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అన్ని రకాల అభివృద్ధి పనులతో త్వరలో కొడంగల్‌ రూపు రేఖలు మారనున్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర అన్నారు. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మహర్దశ పట్టిందన్నారు. తోటి మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డితో కలిసి శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో రూ.76 కోట్లతో అభివృద్ధి పనులకు దామోదర శంకుస్థాపనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా మరో రూ.24.11 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం హరే రామ హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన హరే రామ హరే కృష్ణ ట్రస్టు ప్రతినిధులను దామోదర అభినందించారు. ట్రస్టు ఆధ్వర్యంలో వికారాబాద్‌ జిల్లా పరిధిలోని కొడంగల్‌ నియోజకవర్గంలోని 8 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు.


నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 28వేల మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందించడం సంతోషకరమన్నారు మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో పలు బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న హరే రామ హరే కృష్ణ ట్రస్టు ప్రతినిధులను అభినందించారు. కొడంగల్‌ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సాగు, తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. హరే రామ హరే కృష్ణ ట్రస్టు సేవలు రాష్ట్ర నలుమూలలా విస్తరించాలని ఆకాంక్షించారు. గతంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో అల్పాహారం ఏర్పాటుకు నిధులు కావాలని కోరగా తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. గత పదేళ్లలో జరగని మార్పు కోసం సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. హరేరామ హరేకృష్ణ ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాస మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద అల్పాహార కేంద్రాన్ని కొడంగల్‌లో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 03:16 AM