Komatireddy Venkat Reddy: కిరీటం లేకపోతే అమ్మను కాదంటామా?
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:53 AM
‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ వాళ్లకు మాట్లాడే హక్కు లేదు: కోమటిరెడ్డి
అసెంబ్లీకి రాకుండా బీఆర్‌ఎస్ వ్యూహం: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపకల్పనపై అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ అచ్చమైన తెలంగాణ తల్లి రూపాన్ని విగ్రహం పోలి ఉంటే... అస్తిత్వం దెబ్బతిన్నదని వాదించడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణ పేరును తొలగించుకుని టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిందని, కానీ.. తాము మాత్రం టీపీసీసీగానే(తెలంగాణతోనే) ఉన్నామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అని పెట్టుకున్న వాళ్లకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడం ఇష్టం లేకనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా వ్యూహం పన్నారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
అసెంబ్లీకి వస్తే విగ్రహం గురించి మాట్లాడాల్సి వస్తుందన్న కారణంతో అసెంబ్లీ నియమాలు, విధానాలకు విరుద్ధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. నిజానికి ఈ విగ్రహం తెలంగాణ చరిత్రకు దర్పణమని, ఇలాంటి సందర్భంలో మాట్లాడడానికి కూడా బీఆర్‌ఎస్ నాయకుడు బయటికి రాలేదని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని జిల్లాలు, మండలాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఈ విగ్రహాన్ని తెలంగాణ సంస్కృతి స్ఫూర్తితో రూపొందించామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినప్పుడు ప్రతిపక్షాలను పిలవలేదని గుర్తు చేశారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే శంకర్ అన్నారు.