Komatireddy Venkata Reddy: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి
ABN , Publish Date - Sep 27 , 2024 | 04:13 AM
కొత్తగా వచ్చే ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ వంటి వారినే ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
అలాంటి వారిని కలలోకీ రానివ్వొద్దు: మంత్రి కోమటిరెడ్డి
నూతన ఏఈఈల ఓరియెంటేషన్ కార్యక్రమంలో సెటైర్లు
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కొత్తగా వచ్చే ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ వంటి వారినే ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన సంఘటనలను చూశామంటూ ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును గుర్తుచేశారు. అలాంటి నిర్మాణాలను సూచించిన ఇంజనీర్లను కనీసం కలలోకి కూడా రానివ్వొద్డంటూ ఆయన నూతన ఏఈఈలకు సలహా ఇచ్చారు.
హైదరాబాద్, హైటెక్స్ ప్రాంగణంలోని న్యాక్‌లో ఆర్ అండ్ బీ శాఖకు కొత్తగా రాబోతున్న 156 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు శాఖపరమైన అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న 5 రోజుల ఓరియెంటేషన్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం 10 మండలాలకు ఒక ఇంజనీర్ కూడా లేని దుస్థితికి రాష్ర్టాన్ని తీసుకొచ్చిందని, తాము నియామకాలను పూర్తి చేస్తూ ఆర్ అండ్ బీని పటిష్టం చేస్తున్నామని తెలిపారు. కొందరు పాలకులు, అతికొద్దిమంది ఇంజనీర్ల స్వార్థం ఇంజనీర్లందరికి మాయని మచ్చగా మారిందన్నారు. కాగా ఆర్ అండ్ బీకి ఎంపికైన ఇంజనీర్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్టు శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన ప్రకటించారు.