Venkata Reddy: రేవతి మృతికి హీరోనే కారణం
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:54 AM
‘‘సినిమాహాల్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం బాధాకరం. రేవతి మరణించిన విషయాన్ని పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పినా పట్టించుకోకుండా సినిమా చూశారు. రేవతి మృతికి అల్లు అర్జునే కారణమయ్యారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.
పోలీసులు చెప్పినా పట్టించుకోలే.. పరామర్శించడానికి లీగల్ సమస్య ఉంటుందా?
సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి.. సీఎంపై ఆరోపణలు తగవు: మహేశ్‌గౌడ్
అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే: కిషన్‌రెడ్డి.. కక్ష సాధింపు సరికాదు: బండి
పోలీసులు విషయం చెప్పినా పట్టించుకోలేదు
సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
సీఎంపై ఆరోపణలు తగవు: మహేశ్‌గౌడ్
ప్రాణాల కంటే మీ ప్రతిష్ఠే ముఖ్యమా?: ఆది శ్రీనివాస్
పేదలపై ఎందుకు ఇంత చిన్నచూపు?: ఎంపీ అనిల్
ప్రజలకు ఏం చెతున్నారన్న ధ్యాసే లేదు: చామల
యాదగిరిగుట్ట రూరల్/నిజామాబాద్ అర్బన్/హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘సినిమాహాల్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం బాధాకరం. రేవతి మరణించిన విషయాన్ని పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పినా పట్టించుకోకుండా సినిమా చూశారు. రేవతి మృతికి అల్లు అర్జునే కారణమయ్యారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే, ఆ వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఆయన సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక నుంచి సిని మా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతు లు ఉండవన్నారు.
సినిమా థియేటర్‌లో గాయపడిన బాబును పరామర్శించేందుకు కూడా అల్లు అర్జున్ వెళ్లలేదని, పరామర్శకు లీగల్ సమస్య ఏముంటుందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. అదే సమయంలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందని, అందువల్లే హైదరాబాద్‌లో పద్మాలయ, రామానాయుడు స్టూడియోలు ఏర్పాటయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చ ర్యలకు పాల్పడుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, అలాంటి ఉద్దేశం త మకు లేదన్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే ఎంతటి వారైనా ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పారు.
ప్రాణాల కంటే పేరు, ప్రతిష్ఠలే ఎక్కువనా?
రేవతి కుటుంబంపై అల్లు అర్జున్ కనీసం సానుభూతి చూపలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. పైగా ఈ విషయంలో సీఎం రేవంత్ మాటలను తప్పు పట్టినట్లుగా అల్లు అర్జున్ తీరు ఉందని మండిపడ్డారు. అవతలి వారి ప్రాణాల కంటే ఆయనకు పేరు ప్రతిష్టలే ఎక్కువయ్యాయని విమర్శించారు. అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు బయట ఆంబులెన్స్ వచ్చి అంతా గందరగోళంగా ఉందని, అయినా ఆయనకు ఏం జరుగుతుందన్న ధ్యాస లేకుండా పోయిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పత్రికా సమావేశంలోనూ స్ర్కిప్టు తీసుకుని వచ్చి చదివారని, ప్రజలకు ఏం చెబుతున్నారన్న సోయి కూడా లేదని విమర్శించారు. నిజాలు చెబితే వ్యక్తిత్వ హననం ఎలా అవుతుందని ఎంపీ అనిల్‌కుమార్ యా దవ్ ప్రశ్నించారు. అల్లు అర్జున్‌కు పేదలంటే ఎందుకంత చిన్న చూపు? అని నిలదీశారు.
సినీ హీరో అంటే యువతకు రోల్ మోడల్‌గా ఉండాలని, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని హితవు పలికారు. అల్లు అర్జున్‌కు మద్దతు పలికిన కేటీఆర్.. బాధిత కు టుంబాన్ని ఎందుకు పరామర్శించలేదన్నారు. చేసిన తప్పును అల్లు అర్జున్ సరిదిద్దుకుంటే ఎవరైనా హర్షించే వారని, కానీ తనపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చే స్తుందంటూ హీరోయిజం చూపే ప్రయత్నం చేయడం బాధాకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున పరామర్శకు వెళ్లొద్దని చెప్పిన న్యాయ సలహాదారులు.. ప్రెస్‌మీట్ పెట్టవద్దని చెప్పలేదా? అని నిలదీశారు. ఘటనపై అల్లు అర్జున్ హావభావాల్లో ఎక్కడా బాధ కనిపించలేదని పేర్కొన్నారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోలా వ్యవహరించాలని హితవు పలికారు. తెలుగోడి సత్తా చాటడమంటే.. అభిమానుల ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిలదీశారు.