KTR Vs Seethakka: బ్రేక్ డ్యాన్స్ చేసుకోండనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..?
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:54 PM
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే..
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని (Free Bus For Womens) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ అవకాశంపై రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కేటీఆర్ మాత్రం తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో యావత్ మహిళా లోకం ఒక్కసారిగా భగ్గమన్నది. కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా.. మంత్రి సీతక్క (Minister Seethakka) వీడియోను రిలీజ్ చేశారు. మాజీ మంత్రి వ్యాఖ్యలను సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు.
ఇదేనా సంస్కారం..?
‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు చేసుకోవచ్చని కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. మీ తండ్రి కేసీఆర్‌గారు (KCR) మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్‌లు చేస్తున్నారా?. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. భేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాము. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం. శ్రమ జీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి?’ అని కేటీఆర్‌పై సీతక్క ప్రశ్నల వర్షం కురిపించారు.
మీ నోటికి ఎలా వచ్చాయ్..?
‘ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే.. వారిని బ్రేక్ డ్యాన్స్‌లు వేసుకోమనడం దుర్మార్గం. మహిళలు బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్..? కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి. మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్నాను. తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్స్ చేసుకొండి అనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్..?. తెలంగాణ మహిళలకు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి.. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా క్షమాపణ చెప్పాలి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు.. పదేండ్లు మీరు చేయలేదు. మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు..?. కేటీఆర్ తక్షణ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని సీతక్క డిమాండ్ చేశారు.
ఇంతకీ కేటీఆర్ ఏమన్నారు..?
ఈ మధ్య బస్సుల్లో కొందరు కూరగాయలు అమ్మడం, బ్రష్ చేస్తూ కనిపించడం, వెల్లుల్లి ఒలుస్తూ, కుట్లు వేస్తూ కనిపించడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ.. కుట్లు, అల్లికలే కాదు.. అవసరమైతే డ్యాన్సులు కూడా చేసుకోండని అవమానకరంగా మాట్లాడటం గమనార్హం. తాము తప్పు అని అనడం లేదని.. బస్సులు పెంచండని, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించండి అంటూ కేటీఆర్ హేళనగా కామెంట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఇప్పటికే సీతక్క స్పందిస్తూ.. మహిళల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలని కూడా మంత్రి సీతక్క సూచించారు.