Seethakka: హైవే, స్కైవే, ఫ్లైవేలే కాదు.. ఆదివాసీలు నడిచేందుకు దారులు కూడా
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:55 AM
అభివృద్ధి పేరిట హైవే, స్కైవే, ఫ్లైవేలు నిర్మించడం మాత్రమే కాదు.. ఆదివాసీలు నడించేందుకు కనీసం దారులు నిర్మించాలని.. ఆ దిశగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.
ఆ దిశగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటనలో మంత్రి సీతక్క
ఖానాపూర్/ఉట్నూర్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరిట హైవే, స్కైవే, ఫ్లైవేలు నిర్మించడం మాత్రమే కాదు.. ఆదివాసీలు నడించేందుకు కనీసం దారులు నిర్మించాలని.. ఆ దిశగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన గంగాపూర్‌లో సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా గంగాపూర్, ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామాల మధ్య రూ.22 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఖానాపూర్‌లోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు.
అలాగే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఆయా ప్రాంతాల్లో సీతక్క మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని విధంగా రహదారులు ఉన్నాయని, ఆ పరిస్థితి నుంచి ప్రజలకు విముక్తి కల్పించే విధంగా తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.1300ల కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు. నెల రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.