Minister Sitakka : మహిళల భద్రత కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Aug 14 , 2024 | 04:05 AM
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల భద్రత కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం మంత్రి సీతక్క సమీ క్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత కోసం స్వల్పకాలిక ప్రణాళికలతోపాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు. బంధువులు, పరిచయస్తులు, పరిసరాల్లో నివాసముండే వాళ్ల నుంచే మహిళలకు వేధింపులు ఎదురవడం బాధాకరమన్నారు.
చాలామంది తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకునేందుకు ముందుకు రావడం లేదనీ, వాళ్లలో ధైర్యం నింపేలా చర్యలు చేపడతామన్నారు. కాగా, ఈ నెలాఖరులోగా రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత పంచాయతీలకు వీలైనంత మేర నిధులు కేటాయించేందుకే సర్కారు ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఇటీవలే 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు.
గత ప్రభుత్వం నెలల తరబడి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయకపోవడంతో పెండింగ్ పెరిగిపోయిందని.. ఆ పాలకులే ఇప్పుడు పంచాయతీలకు నిధులివ్వడం లేదని ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తున్నారని విమర్శించారు.