Share News

Komati Reddy Venkat Reddy: యాదాద్రి, వేములవాడకు హరీశ్‌ బినామీ డెయిరీల నెయ్యి

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:12 AM

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బినామీ పేర్లతో నిర్వహిస్తున్న డెయిరీల నుంచి వచ్చే నెయ్యిని యాదాద్రి, వేములవాడ దేవాలయాల్లో లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

Komati Reddy Venkat Reddy: యాదాద్రి, వేములవాడకు హరీశ్‌ బినామీ డెయిరీల నెయ్యి

  • ఆ ఒప్పందాలను రద్దు చేసి, మదర్‌ డెయిరీ నెయ్యినే ఆ గుడుల్లో వాడాలి

  • మంత్రి సురేఖకు మంత్రి వెంకట్‌రెడ్డి వినతి

హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బినామీ పేర్లతో నిర్వహిస్తున్న డెయిరీల నుంచి వచ్చే నెయ్యిని యాదాద్రి, వేములవాడ దేవాలయాల్లో లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ డెయిరీలతో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఫోన్‌ చేసి కోరారు. శనివారం నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం(మదర్‌ డెయిరీ)చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమానికి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీశ్‌రావు బినామీ పేర్లతో చేసిన మోసాలు బయటకు వస్తున్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, ఆఫీసుల్లో మదర్‌ డెయిరీ పాలనే వాడేలా ఆదేశాలివ్వాలని నల్లగొండ, భువనగిరి జిల్లా కలెక్టర్లను కోరారు. మదర్‌ డెయిరీ సుమారు రూ.60 కోట్ల నష్టా ల్లో ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  • మదర్‌ డెయిరీ చైర్మన్‌గా మధుసూదన్‌రెడ్డి ఎన్నిక

మదర్‌ డెయిరీ కొత్త చైర్మన్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి మధుసూదన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Sep 15 , 2024 | 03:12 AM