Hyderabad: మిజోరాం గవర్నర్ కంభంపాటికి తీవ్ర అస్వస్థత
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:48 AM
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు
గ్రీన్ చానల్ ద్వారా స్టార్ ఆస్పత్రికి తరలింపు
శంషాబాద్ రూరల్/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 9: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన భద్రత సిబ్బంది, వ్యక్తిగత డాక్టర్లు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించాలని నిర్ణయించారు. వెంటనే మిజోరాం నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఆయన వైరల్ ఇన్‌ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఆయన ఇంతకు ముందు ఆయన గుండెకు సంబంధించిన చికిత్సలను స్టార్ ఆస్పత్రి వైద్యుల వద్ద తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆయనను ఇక్కడే వైద్యం కోసం ఇక్కడకు తరలించినట్లు తెలుస్తోంది. సోమవారం ఆయనకు అవసరమైన పరీక్షలను చేసినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం నివేదికలు వచ్చిన తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంపై వైద్యులు నిర్దారణకు రానున్నట్లు సమాచారం. ఆయనను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పిన్నట్లు తెలుస్తోంది.