MLC Kavitha: సీబీఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ABN , Publish Date - Feb 25 , 2024 | 06:42 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 26న విచారణకు హాజరుకావడం తనకు సాధ్యంకాదని ఆమె చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022 డిసెంబరులో అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీషర్(ఐవో) ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని ఆమె ప్రస్తావించారు.
గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని, సెక్షన్ 41ఏ కింద ఎందుకు?, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని కవిత వ్యాఖ్యానించారు. నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తోందని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘నాకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుంది. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు. పైగా కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుంది’’ అని కవిత లేఖలో పేర్కొన్నారు.
‘‘ గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాను. నియమనిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం, సెక్షన్లను మార్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించండి’’ అని కవిత్ పేర్కొన్నారు.