Share News

Mohan Babu: తప్పు నాదే.. క్షమించండి

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:08 AM

జర్నలిస్టుపై దాడి ఘటనలో సినీనటుడు మోహన్‌ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్టు రంజిత్‌, అతని కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణలు చెప్పారు.

Mohan Babu: తప్పు నాదే.. క్షమించండి

  • సారీ చెప్పడం తప్ప మాట్లాడలేని స్థితిలో ఉన్నా

  • జర్నలిస్టు రంజిత్‌తో మంచు మోహన్‌బాబు

  • విష్ణుతో కలిసి ఆస్పత్రికి వెళ్లి పరామర్శ

  • కుటుంబానికి అండగా ఉంటానని హామీ

  • జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుపై దాడి ఘటనలో సినీనటుడు మోహన్‌ బాబు తన తప్పును అంగీకరించారు. బాధిత జర్నలిస్టు రంజిత్‌, అతని కుటుంబ సభ్యులకు స్వయంగా క్షమాపణలు చెప్పారు. జల్‌పల్లిలోని తన నివాసం వద్ద తాను చేసిన దాడిలో గాయపడి ఆస్పత్రిపాలైన జర్నలిస్టు రంజిత్‌ను మోహన్‌ బాబు ఆదివారం పరామర్శించారు. తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. బాధిత జర్నలిస్టుకు క్షమాపణ చెప్పారు. రంజిత్‌ కుమార్తె, ఇతర కుటుంబసభ్యులకు కూడా క్షమాపణలు తెలియజేశారు. ఆ రోజు జరిగిన ఘటనకు తాను బాధపడుతున్నానని, అలా జరిగి ఉండాల్సింది కాదని, తప్పు తనదేనని రంజిత్‌తో అన్నారు.


క్షమించమని అడగడం తప్ప.. ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని రంజిత్‌, అతని భార్యాపిల్లలకు వివరణ ఇచ్చుకున్నారు. అలాగే, రంజిత్‌ కుమార్తెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఎత్తుకున్నారు. సారీ తల్లి నా వల్లే మీ నాన్నకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ చిన్నారితో అన్నారు. అనంతరం, రంజిత్‌, అతని కుటుంబసభ్యులతో మాట్లాడి.. రంజిత్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రెండు కాళ్లు, భుజాలు, కళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న తనకు... శస్త్రచికిత్సల బాధ ఎలా ఉంటుందో తెలుసునని ఈ సందర్భంగా వారితో అన్నారు. రంజిత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రంజిత్‌ కుటుంబానికి అండగా ఉంటానని, ఏ సాయం చేయడానికైనా సిద్ధమని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 16 , 2024 | 05:08 AM