Share News

Yadagirigutta: గుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:18 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించే పనుల్లో కదలిక వచ్చింది.

Yadagirigutta: గుట్ట విమాన గోపురానికి త్వరలోనే స్వర్ణ తాపడం

  • పనుల పూర్తికి ప్రభుత్వం ఆదేశం

  • నివేదిక రూపకల్పనలో అధికారులు

  • 60 కిలోల బంగారంతో తాపడం

  • 5 కోట్లతో రాగి రేకుల పని పూర్తి

  • గుట్ట విమాన గోపురానికి

యాదాద్రి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయించే పనుల్లో కదలిక వచ్చింది. యాదగిరిగుట్టలో చేపట్టాల్సిన ఆలయ అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అధికారులకు ఆదేశించడంతో ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కాగా, ఆలయ ఉద్ఘాటనకు ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌.. స్వామివారి ఆలయంలోని విమానగోపురానికి తిరుమల మాదిరిగా బంగారం తాపడం పనులు చేయించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించి, తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం అందజేశారు. కేసీఆర్‌తోపాటు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా విరాళాలు అందజేశారు. అయితే 2022లో ఆలయ ఉద్ఘాటన అనంతరం భక్తుల నుంచి ఆశించిన స్థాయిలో విరాళాలు, బంగారం రాకపోవడంతో విమాన గోపురానికి బంగారం తాపడం పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.


విరాళాలు, బంగారంపై లెక్కలు..

స్వామివారి విమాన గోపురానికి బంగారం తాపడం పనులపై ప్రభుత్వ నిర్ణయంతో.. ప్రస్తుతం ఆలయ పరిధిలో ఉన్న విరాళాలు, బంగారం ఎంతమేరకు ఉందన్న అంశంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. స్వామివారి ప్రధానాలయంలోని విమాన గోపురం మొత్తం 10,500 చదరపు అడుగులు ఉండగా, 60 కిలోల బంగారంతో తాపడం పూర్తయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భక్తులు సమర్పించిన చందాలు రూ.20.50 కోట్ల మేరకు ఉన్నాయి. మొక్కుల చెల్లింపులో భాగంగా వచ్చిన మిశ్రమ బంగారం దాదాపు 12 కిలోల వరకు, విరాళంగా ఇచ్చిన బంగారం 10.5 కిలోలు ఉంది. భక్తులు సమర్పించిన వెండి 2,300 కిలోల వరకు ఉంది. బంగారంతోపాటు ప్రస్తుతం ఆలయ బ్యాంకు ఖాతాలో ఉన్న విరాళాల నిధులతో 60 కిలోల వరకు బంగారం సమకూరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారు తాపడం పనుల కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 01 , 2024 | 07:08 AM