Rehabilitation: అర్హులకు పథకాలు.. ఉపాధికి ప్రణాళికలు
ABN , Publish Date - Sep 28 , 2024 | 04:13 AM
మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులయ్యే కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తి అండ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు అనుసంధానం
సుందరీకరణకు ఎన్జీవోలు సహకరించాలి: ఎండీ దానకిశోర్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి): మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులయ్యే కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్‌ఐయూఎంలో మూసీ పౌర సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఎన్జీవోల సూచనలు స్వీకరించారు. స్వయం సహాయక సంఘాలు మహిళలపై ప్రధానంగా దృష్టి పెడతాయని చెప్పారు.
సెర్ఫ్ మేనేజర్ దివ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సీడీఎంఏ డైరెక్టర్ గౌతమ్, ఎంఆర్‌డీసీఎల్ జాయింట్ ఎండీ గౌతమి సభ్యులుగా ఉన్న కమిటీ మహిళా శక్తి పేరుతో మెప్మా సభ్యుకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చూస్తుందన్నారు. ఉపాధి, శిక్షణ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇష్టమైన వృత్తిని చేపట్టేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి నిర్వాసిత కుటుంబం జీవనోపాధిపై సర్వే జరుగుతోందని, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే బఫర్ జోన్‌లో నిర్మాణాలపై సర్వే, మార్కింగ్ చేపడతామన్నారు. పట్టా ఉంటే చట్టప్రకారం అన్ని ప్రయోజనాలను అందించాకే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు.
నదీ గర్భంలో కూడా కొందరికి పట్టాలున్నాయని.. వారు పట్టాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఇస్తే, అర్హులైతే పరిహారం అందజేస్తామన్నారు. నిర్వాసిత విద్యార్థులు చదువు దెబ్బతినకుండా డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో ఉన్న పాఠశాలల్లో, ఆసక్తి ఉన్నవారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో చేర్పిస్తామని చెప్పారు. పునరావాసం సజావుగా జరిగేలా ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాలను చైతన్యం చేయాలని ఎన్జీవోలను కోరారు. శంకరన్ స్ఫూర్తితో ఎన్‌జీవోలను, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి వారి తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ భవిష్యత్తును కాపాడాలంటే మూసీని పునరుద్ధరించాల్సిందేనని, మేధా పాట్కర్ సహా అనేకమంది సామాజిక కార్యకర్తలు సేవ్ మూసీ పేరుతో కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు.