Musi River: మూసీ ప్రాజెక్టు రెండు దశల్లో!
ABN , Publish Date - Oct 22 , 2024 | 03:06 AM
మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు.
తొలి దశలో నదీ ప్రవాహ ప్రాంతం, అటూ ఇటు కట్ట
రెండో దశలో ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్.. రోడ్లు
డీపీఆర్ మాత్రం మొత్తానికే.. ప్రాజెక్టు పూర్తికి ఆరేళ్లు
నదీ గర్భంలో 1600 ఇళ్లు, బఫర్‌జోన్‌లో 13వేల ఇళ్లు
బాధిత కుటుంబాలకు పరిహారం, డబుల్ ఇళ్లు, స్థలం
రింగ్‌రోడ్డుకు దగ్గర్లో 150-200 గజాలు
సియోల్ పర్యటన, పరిశీలనతో సరికొత్త ఆలోచన
(సియోల్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి): మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నదీగర్భం.. మూసీకి అటూ ఇటూ ఉన్న ప్రాంతం (కట్టలు) మాత్రమే వస్తాయి. రెండో దశలో మూసీ నదికి అటూ ఇటూ 50 మీటర్ల పరిధిలోని బఫర్‌జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డీపీఆర్‌ను మాత్రం ఒకే ప్రాజెక్టు కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగేందుకే ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తిచేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందునా.. మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండోదశకు అవసరమైన కార్యాచరణ మొదలు పెడతారని సమాచారం.
మూసీ నది గర్భంలో కొన్ని ఇళ్లే ఉండటం, బఫర్‌జోన్ పరిఽధికొచ్చేసరికి ఎక్కువ ఇళ్లు ఉండటమూ రెండు దశల్లో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన కారణం అన్న భావన వ్యక్తమవుతోంది. మూసీ నది గర్భంలో ప్రభుత్వం గుర్తించిన దాని ప్రకారం 1600 ఇళ్లు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామందిని ఇప్పటికే ఖాళీ చేయించి అక్కడి నుంచి తరలించారు. ఫలితంగా ప్రాజెక్టు తొలి దశను త్వరితగతిన ప్రారంభించుకునేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బఫర్‌జోన్‌తో కలుపుకొంటే సుమారు 13వేల మంది వరకు ఇళ్లను కోల్పోతున్నారని అంచనా. ప్రస్తుతం సియోల్ పర్యటనలో ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి .సోమవారం ఇక్కడి చంగ్ ఏ చంగ్ ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగింది.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితో కూడా చర్చించారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏడాదిన్నర సమయం పడుతుందని... మొత్తం ప్రాజెక్టును ఆరేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం మూసీకి అటూ ఇటూ రిటెయినింగ్ వాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి.. అటూ ఇటూ కట్టలను సుందరీకరణ చేయాలని భావిస్తోంది. ఇక బఫర్‌జోన్‌లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేర రెండు వైపులా విశాలమైన రహదారిని నిర్మిస్తారు. అటూ ఇటూ రహదారుల ప్రక్కన ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపడతారు. చంగ్ ఏ చంగ్ నదిని సందర్శించేందుకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, డైరక్టర్ పి.గౌతమి, మూసీ నది అభివృద్ది కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ తదితరులు దీనిపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఈ అంశంపై వారితో చర్చించారు.
ఇళ్ల స్థలాలకు 600-800ల ఎకరాలు అవసరం: పొంగులేటి
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయే బాధితులకు పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోతున్నవారిలో అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే కొందరికి ఇళ్లు కేటాయించగా వారు అక్కడికి వెళ్లారు. ఇళ్లు కోల్పోనున్నవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాధిత కుటుంబాలకు రింగ్‌రోడ్డుకు దగ్గర్లో 150-200 గజాల వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు ఇస్తామన్న నగదు పరిహారం ఇవ్వడం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడంతో పాటు, ఇంటి స్థలాలు కూడా ఇస్తామని పొంగులేటి తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు 600-800 ఎకరాలు అవసరపడుతుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
లేఅవుట్ వే సి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం కొంత తీసేయగా ఎకరానికి సుమారు మూడువేల గజాలు మిగులుతుందని అన్నారు. ఈ మేరకు 200గజాల చొప్పున ఇస్తే 15మందికి , 150గజాల చొప్పున 20 మందికి ఇవ్వొచ్చునని పేర్కొన్నారు. ఇలా మొత్తం మూసీలో ఇళ్లు కోల్పోతున్న సుమారు 13వేల కుటుంబాలకు ఇచ్చేందుకు అవసరమైన భూమిని గుర్తిస్తామని చెప్పారు హైదరాబాద్‌కు చుట్టుపక్కల చాలాచోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఇందులో ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నవీ ఉన్నాయని ఆ భూములనే బాధితుల ఇళ్ల స్థలాలకు వినియోగిస్తామని చెప్పారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని తెలిపారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో ఉదారంగానే వ్యవహరిద్దామని అంతర్గత భేటీలో సీఎం చెప్పారని వెల్లడించారు. రింగ్‌రోడ్డుకు దగ్గరిలోనే ఉండడం వల్ల, అది కూడా అభివృద్ధి చేసిన లే అవుట్‌లో ఇవ్వడం వల్ల గజం రూ.40-50వేల వరకు విలువ ఉంటుందని చెప్పారు.