IIHT: పొట్టి శ్రీరాములు వర్సిటీలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సు
ABN , Publish Date - Aug 03 , 2024 | 05:38 AM
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని స్థాపించి మూడేళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సును 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబరు 11ను విడుదల చేసిందని చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యార్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)ని స్థాపించి మూడేళ్ల డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సును 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబరు 11ను విడుదల చేసిందని చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యార్ తెలిపారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించటానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని హ్యాండ్లూమ్ పార్కులో శాశ్వత భవనాలను సమకూర్చిన తర్వాత కోర్సును అక్కడికి తరలిస్తామని చెప్పారు. 18 నుంచి 23 ఏళ్ల వయసున్న పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలకు అర్హులని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్ల వరకు వయసు మినహాయింపు ఉందని తెలిపారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు నెలకు రూ. 2,500 చొప్పున ఉపకారవేతనం కూడా అందిస్తామని కమిషనర్ వెల్లడించారు.