Share News

Hyderabad: ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో హెలిప్యాడ్‌

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:38 AM

హైదరాబాద్‌లో మరో హెలిప్యాడ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలోనే అందుబాటులో ఉండగా.. తాజాగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మరొక హెలిప్యాడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Hyderabad: ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో హెలిప్యాడ్‌

  • కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సర్కారు

  • ఇక్కడి నుంచే సిద్దిపేటకు సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మరో హెలిప్యాడ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలోనే అందుబాటులో ఉండగా.. తాజాగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో మరొక హెలిప్యాడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి, ఇక్కడ గతంలోనే ఓ హెలిప్యాడ్‌ ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు, ప్రముఖులు వచ్చి వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించారు. ఆ తర్వాత వినియోగించలేదు. ఏళ్ల తరబడి పడావు పడింది. ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్లాలనుకున్నప్పుడు బేగంపేట వెళ్లి.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అప్పుడు సీఎం జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బేగంపేట వరకు ట్రాఫిక్‌ను నిలువరించాల్సి వస్తోంది.


అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటుండడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. దాంతో, సీఎం నివాసానికి దగ్గర్లోనే ఉన్న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని హెలిప్యాడ్‌పై అధికారులు దృష్టిసారించారు. అది పడావు పడడం, దాని పక్కన కొన్ని భవనాలను నిర్మించడంతో దానిని వినియోగించలేమనే అభిప్రాయానికి వచ్చారు. దానికి 200 మీటర్ల దూరంలో కొత్త హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి మెదటిసారి హెలికాఫ్టర్‌ ప్రయాణం చేశారు. అంతకుముందు అక్కడ అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌కు వెళ్లారు. ఇది అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఉండబోదని అధికారిక వర్గాలు అంటున్నాయి.

Updated Date - Dec 03 , 2024 | 03:38 AM