Share News

Cholesterol: ఆర్నెల్లకో ఇంజెక్షన్‌తో.. గుండెపోటుకు చెక్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:43 AM

మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) రెండూ ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ పెరిగిపోతే రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది.

Cholesterol: ఆర్నెల్లకో ఇంజెక్షన్‌తో.. గుండెపోటుకు చెక్‌

  • చెడు కొలెస్ట్రాల్‌ తయారీని జన్యుస్థాయిలో

  • అడ్డుకునే అద్భుత ఔషధం.. ఇన్‌క్లిసిరాన్‌

  • ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడి

  • హైదరాబాద్‌ అపోలోలో అందుబాటులోకి

  • ఒక్కో ఇంజెక్షన్‌ ఖరీదు దాదాపు రూ.లక్ష

  • చెడ్డ కొలెస్ట్రాల్‌ తయారీని జన్యుస్థాయిలో అడ్డుకునే అద్భుత ఔషధం.. ఇన్‌క్లిసిరాన్‌

  • ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌), మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) రెండూ ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ పెరిగిపోతే రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంటుంది. శరీరానికి హాని చేసే ఈ ఎల్‌డీఎల్‌ను తగ్గించడానికి రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఆ సంప్రదాయ మందులకు భిన్నంగా జన్యుస్థాయిలోనే ప్రభావం చూపి ఎల్‌డీఎల్‌ తయారీకే అడ్డుకట్ట వేసే ఒక ఇంజెక్షన్‌ ఇప్పుడు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఖరీదు కాస్తంత ఎక్కువే. దాదాపు లక్ష రూపాయల విలువైన ఈ ఇంజెక్షన్‌ను ఆర్నెల్లకొకసారి చేయించుకుంటే.. గుండెపోటు రాకుండా సాఫీగా జీవించవచ్చని అపోలో ఆస్పత్రికి చెందిన సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుమార్‌ వివరించారు. గుండెపోటు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకునేకంటే.. చెడ్డ కొలెస్ట్రాల్‌ బాధితులు ముందు జాగ్రత్త చర్యగా ఈ ఇంజెక్షన్‌ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా జీవించవచ్చునని ఆయన తెలిపారు.


గతంలో ధమనులు పూర్తిగా బ్లాక్‌ అయినప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసేవారని.. కానీ, ఇప్పుడు బ్లాక్‌ అయిన ధమనులను క్లియర్‌ చేయడానికి ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని.. అలాంటి ఒక ప్రత్యేక పద్ధతే ఈ ఇంజెక్షన్‌ అని డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఇతర దేశాల్లోనూ దీన్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ ఇంజెక్షన్‌ను స్టెంట్‌ వేయించుకున్న వారు, బైపాస్‌ సర్జరీ చేయించుకున్నవారూ తీసుకోవచ్చని చెప్పారు. అయితే.. ఈ ఇంజెక్షన్‌ ఎల్‌డీఎల్‌ అధికంగా ఉన్న వారిలో బాగా పనిచేస్తుందిగానీ, ట్రైగ్లిజరైడ్స్‌ అధికంగా ఉన్న వారికి ఉపయోగపడదన్నారు. అపోలో ఆస్పత్రిలో మూడు నెలల నుంచి ఈ ఇంజెక్షన్‌ అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి జరగనున్న ప్రీమియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ కాన్ఫరెన్స్‌ సదస్సులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వైద్యులకు దీనిపై 30ు మేరకు రాయితీ ఇవ్వనున్నట్లు డాక్టర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ ఇంజెక్షన్‌ వినియోగం పెరిగితే.. భవిష్యత్తులో ధర తగ్గే అవకాశముందన్నారు. కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్న వారు ఏ వయసులోనైనా ఈ ఇంజెక్షన్‌ చేయించుకోవచ్చని చెప్పారు. అయితే.. ‘ఇంజెక్షన్‌ తీసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యంగా ఉండడం మంచిదికాదని.. ఏది పడితే అది తినడం, కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి జీవనశైలితో గుండెకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.


ఇలా పనిచేస్తుంది..

మన శరీరంలో ఉండే ‘ఎల్‌డీఎల్‌ రిసెప్టర్ల’ను నాశనం చేసే ప్రొటీన్‌ను నియంత్రించే ఒక కీలకమైన జన్యువు.. పీసీఎ్‌సకే9 (ప్రోప్రొటీన్‌ కన్వర్టేజ్‌ సటిలిసన్‌/కెక్సిన్‌ టైప్‌ 9). ఎల్‌డీఎల్‌ రిసెప్టర్లు రక్తంలో ఉండి.. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) రేణువులకు అతుక్కుని.. ఆ రేణువులను కాలేయంలోకి తీసుకెళ్తాయి. అక్కడ కాలేయం ఎల్‌డీఎల్‌ను బ్రేక్‌డౌన్‌ చేసి అధికంగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కానీ, పీసీఎ్‌సకే9 ప్రొటీన్‌ ఆ రిసెప్టర్లను నాశనం చేయడం వల్ల ఎల్‌డీఎల్‌ రక్తనాళాల్లో పెద్దఎత్తున పేరుకుపోయి గుండెపోటుకు కారణమవుతుంది.


దీంతో పీసీఎ్‌సకే9ను పనిచేయకుండా చేసే (ఇన్హిబిటర్‌) ఔషధాలపై శాస్త్రజ్ఞులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి కొన్ని ఇన్హిబిటర్లు పాశ్చాత్యదేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌క్లిసిరాన్‌ కూడా ఆ కోవలోనిదే. ఇది పీసీఎ్‌సకే9 జీన్‌ను స్విచాఫ్‌ చేసేస్తుంది. దానివల్ల పీసీఎ్‌సకే9 ప్రొటీన్‌ అసలు తయారే కాదు. ఆ ప్రొటీన్‌ లేకపోవడం వల్ల.. ఎల్‌డీఎల్‌ రిసెప్టర్లు స్వేచ్ఛగా పనిచేయగలుగుతాయి. ఫలితంగా శరీరంలో ఎల్‌డీఎల్‌ స్థాయులు తగ్గిపోతాయి. గుండెపోటు ముప్పూ తగ్గుతుంది.

Updated Date - Jul 26 , 2024 | 05:43 AM