Share News

Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్‌

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:22 AM

సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో ఓ నవజాత శిశువు అపహరణకు గురైంది. బుధవారం తెల్లవారుజామున పుట్టిన ఆడపిల్లను గుర్తు తెలియని నలుగురు మహిళలు మధ్యాహ్నం ఎత్తుకెళ్లారు.

Sangareddy: సంగారెడ్డిలో నవజాత శిశువు కిడ్నాప్‌

  • ప్రభుత్వాస్పత్రి నుంచి ఎత్తుకెళ్లిన నలుగురు మహిళలు

  • ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న పోలీసులు

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 9: సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో ఓ నవజాత శిశువు అపహరణకు గురైంది. బుధవారం తెల్లవారుజామున పుట్టిన ఆడపిల్లను గుర్తు తెలియని నలుగురు మహిళలు మధ్యాహ్నం ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా మనూర్‌ మండలం దూదికొండకు చెందిన నసీమా(25) ప్రసవం నిమిత్తం మంగళవారం అర్ధరాత్రి ఎంసీహెచ్‌లో చేరారు. వైద్యులు బుధవారం తెల్లవారుజామున సిజేరియన్‌ చేయగా నసీమా ఆడపిల్లను ప్రసవించింది. అయితే, నసీమా తల్లి మున్నీభీ, అత్త హమీదా ఆ పసికందును ఎత్తుకుని బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రి కారిడార్‌లో కూర్చున్నారు.


నసీమా కుమారుడు కూడా వారి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో హమీదా ఆస్పత్రి ఎంఐసీయూలో ఉన్న నసీమా వద్దకు వెళ్లింది. ఆ సమయంలో మున్నీభీ వద్దకు వచ్చిన నలుగురు గుర్తు తెలియని మహిళలు(ముఖానికి మాస్కులు ధరించారు).. ఆమె దృష్టి మళ్లించి రెండు నిమిషాల్లో పసికందును తీసుకెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న మున్నీభీ కేకలు వేయగా ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. పసికందును కిడ్నాప్‌ చేసి తిరిగి వెళుతున్న క్రమంలో ఆస్పత్రి పార్కింగ్‌ వద్ద నలుగురు మహిళలూ నల్లటి బుర్కాలు ధరించారు.


ఆ నలుగురిలో ఇద్దరు ఆటోలో, ఇద్దరు ద్విచక్రవాహనంలో వెళ్లిపోయారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్పీ రూపేష్‌.. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీలో కనిపించిన ఆటో నెంబరు ద్వారా సంబంధిత ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మహిళలను పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో వదిలేసినట్టు తెలిపాడు. దీంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు.. పసిబిడ్డను కిడ్నాప్‌ చేసిన మహిళల కోసం గాలిస్తున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 04:22 AM