Share News

NHAI: కంకర.. మట్టి ఇవ్వండి..!

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:59 AM

రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో తొమ్మిది రోడ్లను నిర్మిస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.

NHAI: కంకర.. మట్టి ఇవ్వండి..!

  • జాతీయ రహదారుల నిర్మాణానికి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఎన్‌హెచ్‌ఏఐ

  • ఆరు జిల్లాల్లో తొమ్మిది ఎన్‌హెచ్‌ పనులు

  • 90 లక్షల మెట్రిక్‌ టన్నుల కంకర అవసరం

  • 2.19 కోట్ల మెట్రిక్‌ టన్నుల మట్టి కూడా

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో తొమ్మిది రోడ్లను నిర్మిస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఆయా జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన కంకర, మట్టి సమీప ప్రాంతాల్లో లభించకపోవడంతో పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో.. కంకర, మట్టి కోసం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ రహదారుల నిర్మాణానికి 90 లక్షల మెట్రిక్‌ టన్నుల కంకర, 2.19 కోట్ల మెట్రిక్‌ టన్నుల మట్టి అవసరం. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మైనింగ్‌ పాలసీతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయనకు వివరించారు.


మైనింగ్‌ పాలసీతో ఇబ్బందులు

గత ప్రభుత్వం 2022 నవంబరు 10న నూతన మైనింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తూ.. జీవోలు 44, 45లను విడుదల చేసింది. దీని ప్రకారం ఏదైనా కంపెనీలకు, లేదా అభివృద్ధి అవసరాలకు క్వారీలు కావాలంటే.. తప్పనిసరిగా ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొనాలి. ఒకవేళ వేలంలో పాల్గొన్నా.. సంబంధిత కాంట్రాక్టర్‌కు క్వారీ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. బిడ్‌ దక్కించుకున్న వారికే క్వారీలను కేటాయిస్తారు. ఈ విధానం వల్ల జాతీయ రహదారుల పనులకు తీవ్ర ఆటంకాలేర్పడుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. కాంట్రాక్టర్లు పనులు ఒకచోట చేస్తుండడం.. క్వారీలో సుదూర ప్రాంతాల్లో ఉంటుండంతో దూరాభారం, రవాణా ఖర్చు పెరుగుతోందని, ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని, క్వారీల అనుమతులను సులభతరం చేయాలని కోరారు. 1967 సెప్టెంబరు 4 నాటి జీవో-1172 ప్రకారం క్వారీలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పరిష్కార బాధ్యతలను మైనింగ్‌ శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిసింది.

Updated Date - Jul 12 , 2024 | 04:59 AM