Share News

Nitin Gadkari: ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తాం

ABN , Publish Date - Dec 21 , 2024 | 05:05 AM

జాతీయ రహదారి 65కి ఉత్తర భాగంలోని ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు.

Nitin Gadkari: ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తాం

  • కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ

చౌటుప్పల్‌ టౌన్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 65కి ఉత్తర భాగంలోని ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌పై పునరాలోచన చేస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రిపుల్‌ ఆర్‌ భూ నిర్వాసితులు శుక్రవారం ఽఢిల్లీలో గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. అలైన్‌మెంట్‌ మార్చాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన సిఫారసు లేఖలను కేంద్రమంత్రికి సమర్పించారు.


ఓఆర్‌ఆర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించాల్సిన ట్రిపుల్‌ ఆర్‌ను రెండు, మూడు పరిశ్రమల యజమానుల ఒత్తిడి మేరకు 28 కిలోమీటర్లకు కుదించారని, దీంతో చౌటుప్పల్‌, భువనగిరి, గజ్వేల్‌ మునిసిపాలిటీలను రెండుగా విడిపోతున్నాయని నిర్వాసితులు తెలిపారు. రూ.కోట్ల విలువైన ఆస్తులను కోల్పోవాల్సి వస్తుందని పలు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వాపోయారు. భూ నిర్వాసితుల ఆవేదన తనకు అర్థమైందని, న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌లకూ నిర్వాసితులు వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - Dec 21 , 2024 | 05:05 AM