Telangana: కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మంత్రి పదవి కన్ఫామ్..!
ABN , Publish Date - Jun 21 , 2024 | 01:14 PM
బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) కాంగ్రెస్‌లో(Congress) చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
బాన్సువాడ, జూన్ 21: బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) కాంగ్రెస్‌లో(Congress) చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) స్వయంగా పోచారం ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన పోచారం.. వెంటనే తన తనయుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఇవాళో, రేపో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ విస్తరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ ఆఫర్ చేశారట. దాంతో ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది.
రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌లోకి పోచారం..
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశామన్నారు. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళ్తామని సీఎం చెప్పారు. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని సీఎం తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి భవిష్యత్‌లో సముచిత గౌరవం ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు. తమది రైతు రాజ్యం అని.. రైతు సంక్షేమ రాజ్యం అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకునిపోతామని ప్రకటించారు రేవంత్.
రేవంత్ రైతు పక్షపాతి..
రాష్ట్ర రైతాంగానికి మేలు చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రేవంత్ చేస్తున్న రైతు అనుకూల పనులకు రైతు బిడ్డగా గర్విస్తున్నానని అన్నారు. రేవంత్ యువ నాయకుడు అని.. ఇంకా 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందన్నారు. తాను ఎన్నో పదవులు అనుభవించానని చెప్పారు. రేవంత్ రైతు పక్షపాతి.. రైతుల కోసం పాటుపడే వ్యక్తి అని ప్రశంసించారు పోచారం.