Medical Education: పదోన్నతులివ్వరు.. నియామకాలూ చేపట్టరు!
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:33 AM
రాష్ట్రంలో వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిఽధిలో పదేళ్లుగా పదోన్నతులు నిలిచిపోయాయి. 2014 నుంచి నేటి వరకు కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వలేదు. లేనిపోని మెలికలు పెడుతూ పదోన్నతులు నిరాకరిస్తున్నారు.
బోధనాస్పత్రుల్లో పదేళ్లుగా డైటీషియన్లే లేరు
రోగులకు అందని నాణ్యమైన ఆహారం
ఇటీవల ఓ బోధనాస్పత్రిలో పురుగుల అన్నం
34 ఆస్పత్రుల్లో ఖాళీగా డైటీషియన్ పోస్టులు
పదోన్నతులపై డీఎంఈ చిన్నచూపు
కోర్టుకెక్కిన బాధితులు.. అయినా పట్టని వైనం
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలో పదేళ్లుగా పదోన్నతులు నిలిచిపోయాయి. 2014 నుంచి నేటి వరకు కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వలేదు. లేనిపోని మెలికలు పెడుతూ పదోన్నతులు నిరాకరిస్తున్నారు. డీఎంఈ పరిధిలో నాలుగు రకాల కేడర్లకు గడిచిన పదేళ్లుగా పదోన్నతులివ్వడం లేదు. డైటీషియన్లు, బయోకెమిస్ట్, లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటిలో బయోకెమిస్టుకు సంబంధించి మాత్రం ఒక్కసారి పదోన్నతులిచ్చారు. మిగిలిన వాటికి ఇంతవరకు ఇవ్వలేదు. అప్పటి డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఇప్పటి డీఎంఈ డాక్టర్ వాణి కూడబలుక్కొనే తమకు పదోన్నతులు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. అసలు మీకెందుకు పదోన్నతులు ఇవ్వాలంటూ ఉన్నతాఽధికారులు అవమానకరంగా మాట్లాడడం మరింత బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
34 బోధనాస్పత్రుల్లో 2, 3 చోట్లే డైటీషియన్లు!
బోధనాస్పత్రుల్లో డైటీషియన్లు లేకపోవడంతో రోగులకు ఇచ్చే డైట్‌ను పర్యవేక్షించే వారే ఉండడం లేదు. దీంతో రోగులకు నాణ్యమైన ఆహారం లభించడం లేదు. ఇటీవల ఓ బోధనాస్పత్రిలో రోగులకు ఇచ్చే ఆహారంలో పురుగులు వచ్చాయి. ఇప్పటికే గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రులపాలు అవుతుండగా.. చికిత్స అందించాల్సిన ఆస్పత్రిలోనే అలాంటి ఆహారం ఇస్తే.. రోగుల పరిస్థితి దైవాధీనమే! బోధనాస్పత్రుల్లో రోగులకు సరైన ఆహారాన్ని సూచించేది డైటీషియన్లే. రోజూ డైట్ కాంట్రాక్టర్లు మెనూ పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని తనిఖీ చేసేదీ వారే. అలాంటి కీలక పోస్టులు లేకపోవడంతో డైట్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ పోస్టులను పదోన్నతిపై చేపట్టాలి. కానీ, దశాబ్దకాలంగా డీఎంఈ సీట్లో కూర్చుంటున్న వారు ఈ పదోన్నతులు ఇవ్వడం లేదు.
నేరుగా నియామకాల ద్వారానైనా ఆ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, అదీ చేయడం లేదు. అంతా తమ ఇష్టానుసారం అన్నట్లుగా డీఎంఈ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఆ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో డైటీషియన్లకు పదోన్నతులు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ప్రమోషన్ల ఊసే లేదు. ప్రస్తుతం 34 బోఽధనాస్పత్రులుంటే రెండు మూడు చోట్ల మాత్రమే డైటీషియన్లు ఉన్నారు. 42 డైటీషియన్, 27 బయోకెమిస్టు, 44 లైబ్రేరియన్, 22 అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా.. పట్టించుకోవడం లేదు. అసలు ఇలాంటి పరిస్థితి ఏ శాఖలోనూ లేదని, పదోన్నతుల గురించి అడిగితే హేళన చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’తో బాధితులు వాపోయారు.
హడావుడి చేయడం.. ఆపై అటకెక్కించడం..
ప్రభుత్వాలు మారినప్పటికీ తమ తలరాతలు మారడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా పదోన్నతుల ఫైలు పెట్టడం, ప్యానెల్ ఇయర్ ముగిసేదాకా సాగదీయడం, మళ్లీ పక్కనపెట్టడమనేది ఆనవాయితీగా వస్తోందని వాపోతున్నారు. ఈ ఏడాది కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు అదే తంతు కొనసాగించారు. దీంతో తమకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని డీఎంఈని ఆదేశించాలంటూ 15 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నోటీసులకు డీఎంఈ కార్యాలయం సమాధానం ఇవ్వలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కోర్టులనూ లెక్కచేయడం లేదని బాధితులు అంటున్నారు. ఇక కోర్టును ఆశ్రయించారనే కోపంతో వారి పదోన్నతులకు మరిన్ని కొర్రీలు వేసినట్లు తెలుస్తోంది. వారికి పదోన్నతులు రాకుండా, కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా ఫైల్‌ను సిద్ధం చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.