Share News

Hyderabad: జానీ మాస్టర్‌ చంచల్‌గూడ జైలుకు..

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:29 AM

అత్యాచారం కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషా(42)ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయన్ను గోవా నుంచి నగరానికి తీసుకొచ్చిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు..

Hyderabad: జానీ మాస్టర్‌ చంచల్‌గూడ జైలుకు..

  • 14 రోజుల రిమాండ్‌

  • దురుద్దేశంతోనే బాలికను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు

  • చేరిన నెలలోపే ముంబైలో రేప్‌

  • భయపెట్టి ఆ తర్వాతా పలుమార్లు.. రిమాండ్‌ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ/ రాజేంద్రనగర్‌/నార్సింగి, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): అత్యాచారం కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషా(42)ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయన్ను గోవా నుంచి నగరానికి తీసుకొచ్చిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు.. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గా ల వాదనలూ విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు.


అనంతరం జానీ మాస్టర్‌ను అత్తాపూర్‌ జాయ్‌ హాస్పిటల్‌ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు.. మధ్యాహ్నం చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా.. రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. జానీమాస్టర్‌ దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఒక ప్రముఖ డ్యాన్స్‌ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని.. తర్వాత జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరిందన్నారు. 2019, డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్‌ వద్దే పనిచేస్తూ అల్కాపురికాలనీలో ఉంటోందని.. ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్‌హిట్‌ సినిమాకు పనిచేశారని తెలిపారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10న (అంటే చేరిన నెలరోజుల్లోపే) జానీ మాస్టర్‌, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబైకి వెళ్లారన్నారు.


ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలిని ఆధార్‌కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించిన మాస్టర్‌.. ఆమె గదిలోకి రాగానే గడియపెట్టి అత్యాచారం చేశాడని.. అప్పటికీ బాలిక వయసు 16 సంవత్సరాలని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అందుకే జానీమాస్టర్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టినట్టు వెల్లడించారు. హోటల్‌ గదిలో జరిగినదాని గురించి ఎవరికైనా చెప్తే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు పరిశ్రమలోనే లేకుండా చేస్తానం టూ బాధితురాలిని జానీమాస్టర్‌ బెదిరించినట్టు తెలిపారు. భయపడిన బాధితురాలు మిన్నకుం డా ఉండిపోవడంతో.. అలుసుగా తీసుకుని షూటింగ్‌ స్పాట్‌లో, వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని, ఒప్పుకోకుంటే దాడి చేసేవాడని పేర్కొన్నారు.


చెప్పినట్లు వినకుంటే షూటింగ్‌ లొకేషన్‌లో అందరి ముందూ అసభ్యకరంగా మాట్లాడి అవమానించేవాడని.. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ పలు సందర్భాల్లో ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని వెల్లడించారు. అతని వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె సొంతగా పనిచేయడం ప్రారంభించిందని.. దీంతో ఒకరోజు జానీమాస్టర్‌, ఆయన భార్య ఆమె ఇంటికి వెళ్లారని, అక్కడ బాధితురాలి చెంపపై మాస్టర్‌ భార్య కొట్టారని.. కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితురాలిపై దాడికి యత్నించారని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న అకృత్యాల గురించి జానీ మాస్టర్‌ వద్ద పనిచేస్తున్న మరో అసిస్టెంట్‌ సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు.

Updated Date - Sep 21 , 2024 | 03:29 AM