Job Notification: 2050 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:19 AM
వైద్య, ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లోనే మరో నోటిఫికేషన్ విడుదలైంది.
28 నుంచి దరఖాస్తుకు చాన్స్
నవంబరు 17న పరీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాలు
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వెయిటెజీ
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలైంది. సరిగ్గా వారం రోజుల్లోనే మరో నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబరు 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా... ప్రస్తుతం స్టాఫ్‌నర్సుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,050 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి బుధవారం నియామక బోర్డు కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 16 నుంచి 17వ తేదీ మధ్య దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
నవంబరు 17న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్ష ఉంటుంది. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎమ్), బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులే ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసే సమాయానికి తప్పనిసరిగా అభ్యర్థుల విద్యార్హత ధ్రువపత్రాలను తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. పోస్టుల్లో 95 శాతం స్థానికులకేనని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అభ్యర్థుల వయోపరిమితి ఈ ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇచ్చారు. వంద పాయింట్ల ప్రాతిపదిక జరిగే భర్తీ ప్రక్రియలో అర్హత పరీక్షకు 80మార్కులు, వెయిటేజీ కింద 20 మార్కులు కేటాయిస్తారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా కనీసం ఆరు నెలలు పని చేస్తేనే వెయిటెజీ మార్కులొస్తాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆయా ఆస్పత్రుల నుంచే అనుభవ ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట(మొత్తం 13) పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. 2050 పోస్టులకు గాను ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో 1576, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో 332, ఆయు్‌షలో 61, ఐపీఎమ్‌లో ఒకటి, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 80 పోస్టులు ఉన్నాయి. జోన్-1లో 241, జోన్-2లో 86, జోన్-3లో 246, జోన్-4లో 353, జోన్-5లో 183, జోన్-7లో 114 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.ఝజిటటఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽను సందర్శించవచ్చు. కాగా, వచ్చే వారం ఫార్మసిస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.