Share News

Oil Palm: పామాయిల్‌ కాసుల ‘గెల’గల

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:53 AM

ఆయిల్‌పామ్‌ రైతులకు ఈ ఏడాది అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. రెండు, మూడు నెలల నుంచి ధర వేగంగా పెరుగుతూ ఆశలు రేకెత్తిస్తోంది.

Oil Palm: పామాయిల్‌ కాసుల ‘గెల’గల

  • టన్ను రూ.19,144.. గత నెల కంటే రూ.2101 పెరుగుదల

  • రైతుల్లో హర్షం.. ఖమ్మంలో 7 వేల మందికి ప్రయోజనం

  • ధరలపై ఫలించిన మంత్రి తుమ్మల కృషి

అశ్వారావుపేట, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ రైతులకు ఈ ఏడాది అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. రెండు, మూడు నెలల నుంచి ధర వేగంగా పెరుగుతూ ఆశలు రేకెత్తిస్తోంది. మొన్నటివరకు టన్ను గెలల రేటురూ.13 వేల లోపే ఉండగా.. అక్టోబరులో ఏకంగా రూ.19,144కు ఎగబాకింది. ఇది సెప్టెంబరు కంటే రూ.2,101 అధికం. సెప్టెంబరు మొదటితో పోలిస్తే ఏకంగా టన్నుకి రూ.4,756 మేర పెరగడం విశేషం. కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం పెంచడం, ఆయిల్‌ రికవరీ శాతం తదితరాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో జరిపిన చర్చలు.. ఏదైతేనేం ఆయిల్‌పామ్‌ గెలల ధర పైపైకి వెళ్తోంది. దీంతో రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.


జూలై వరకు రూ.12వేల లోపు ఉన్న పామాయిల్‌ గెలల ధర నాలుగు నెలల్లోనే రూ.7 వేలకు పైగా పెరగడం గమనార్హం. వాస్తవానికి చాలా కాలంగా పామాయిల్‌ గెలల ధర పడిపోతోంది. దీంతో తుమ్మల.. పలుమార్లు కేంద్ర మంత్రి, అధికారులతో సంప్రదింపులు జరిపారు. పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5శాతానికి పెంచేలా కృషి చేశారు. తెలంగాణలో 90 శాతం పామాయిల్‌ పంట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పండుతోంది. మొత్తం రెండు లక్షల టన్నుల గెలలను ఉత్తత్తి చేస్తున్నారు. తాజా ధరల పెరుగుదల ప్రభావం ఏడు వేల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. సాగును మరింత విస్తరించడానికి అవకాశం కలగనుంది. కాగా, పామాయిల్‌ రైతులకు మంచి రోజులు వచ్చాయంటూ ఆయిల్‌ఫెడ్‌ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 02 , 2024 | 05:53 AM