Share News

June 2nd: నేటితో రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి..

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:28 AM

‘‘ఈ ఏడాది జూన్‌ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.

June 2nd: నేటితో రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి..

  • హైదరాబాద్‌.. ఇక తెలంగాణకు మాత్రమే రాజధాని

  • విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మనకే

  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం..

  • ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌

  • సోనియా వల్లే దశాబ్దాల కల సాకారమైంది: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ఈ ఏడాది జూన్‌ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. దీంతో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం రాష్ట్ర ప్రజలకే దక్కుతాయి’’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ... పదేళ్లు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు.


రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న కవులు, కళాకారులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతోపాటు ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజాపాలన అందిస్తామని పునరుద్ఘాటించారు. అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచేలా భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైందని ఓ ప్రకటనలో తెలిపారు.


కాగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని.. దశాబ్దాల కలను సాకారం చేసింది సోనియాగాంధీనే అని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ముందుకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 04:28 AM