Share News

Onion Prices: ఘాటెక్కిన ఉల్లి!

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:29 AM

ఉల్లి ఘాటు రాష్ట్రానికీ తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా.. గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది.

Onion Prices: ఘాటెక్కిన ఉల్లి!

ఉల్లి ధరలు పెరుగుతుండడంతో.. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగాన్ని తగ్గిస్తున్నారు. సలాడ్లలోనూ కీరా, నిమ్మకాయ ముక్కలతో సరిపెడుతున్నారు. గ్రేవీ, ఇతర వంటకాల్లోనూ ఉల్లి కనిపించడం లేదు. రెస్టారెంట్లు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి.

15 రోజుల్లో ధర రెట్టింపు

  • సగటున కిలో రూ.60.. ఆదిలాబాద్‌లో రూ.80

  • మహారాష్ట్ర, కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా

  • 4.7 లక్షల టన్నుల బఫర్‌ స్టాక్‌ విడుదలచేసిన కేంద్రం

  • ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమా?

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ఘాటు రాష్ట్రానికీ తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా.. గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డల ధర సగటున రూ.60గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే లభ్యత, డిమాండ్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసాలున్నాయి. ఆదిలాబాద్‌లో ఏకంగా కిలో ఉల్లి రూ.80కి ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మరోవారంలో ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు ఆందోళనచెందుతున్నాయి. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. కర్నూలులో ఉల్లి విస్తీర్ణం 75 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాలకు పడిపోవడంతో.. దిగుబడి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


మహారాష్ట్రలోనూ అకాల వర్షాలతో పంటనష్టం జరిగినట్లు తెలుస్తోంది. సరఫరా తగ్గడం.. డిమాండ్‌ పెరగడంతో రాష్ట్రంలో ధరలు అమాంతం పెరుగుతున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు వివరించారు. పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేశాక.. ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 4.7 లక్షల మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.


ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్వి నిధి ఖరే ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని, దాంతో బఫర్‌స్టాక్‌ను విడుదల చేశామని ఆమె తెలిపారు. ఖరీఫ్‌ సాగు ఉత్పత్తులతో ఉల్లి ధరలు అదుపులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఉల్లి ధర కిలోకు రూ.55గా ఉండగా.. మొబైల్‌ కేంద్రాల ద్వారా రూ.35కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే.. కేంద్రం విడుదల చేసిన బఫర్‌ స్టాక్‌లో.. తెలంగాణకు ఎంతమేర సరుకు వస్తుందనేదానిపై స్పష్టత లేదని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.


  • రూ.60 రైతు బజార్లలోనే..

కిలో ఉల్లి రూ.60 ధర పలుకున్నది కేవలం రైతుబజార్లలోనే..! హైదరాబాద్‌లోని సింహభాగం రైతుబజార్లలో.. సిద్దిపేటలో ఉల్లి ధర రూ.60గా ఉంది. ఎర్రగడ్డ రైతుబజార్‌తోపాటు.. కరీంనగర్‌ మార్కెట్‌లో రూ.55 పలుకుతోంది. మిగతా చోట్ల.. ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండలో రూ.65, వరంగల్‌లో రూ.68, మెదక్‌ జిల్లా రామకృష్ణాపురం, భద్రాద్రి-కొత్తగూడెం, పాల్వంచల్లో రూ.70, ఇల్లెందులో రూ.74, ఆదిలాబాద్‌ మార్కెట్‌లో రూ.80గా సోమవారం ఉల్లి ధరలు నమోదయ్యాయి. కాగా, పేదలు ఇంట్లో వంటకానికి ఏమీ లేకున్నా.. జొన్నరొట్టె-ఉల్లిగడ్డ.. అన్నం-పచ్చిపులుసుతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు ఉల్లి ధరల కారణంగా.. ఆ పరిస్థితులు కూడా లేవని వాపోతున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 08:09 AM