Share News

Hyderabad: ఎక్కడా లేని నిబంధన ఇక్కడా?

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:43 AM

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి (వీసీ) ఖాళీ భరీ కోసం వైద్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Hyderabad: ఎక్కడా లేని నిబంధన ఇక్కడా?

  • యూజీసీ నియమావళికి భిన్నంగా కాళోజీ వర్సిటీ వీసీ భర్తీకి నోటిఫికేషన్‌

  • డీన్‌గా, ప్రిన్సిపల్‌గా అనుభవం తప్పనిసరి

  • ప్రభుత్వ కళాశాలలో డీన్‌ ఎలా ఉంటారు?

  • ప్రైవేటు వారికే అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే నిబంధన పెట్టారా?

  • పెద్దగా రాని దరఖాస్తులు.. 4 రోజుల్లో ముగియనున్న గడువు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి)ః కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉప కులపతి (వీసీ) ఖాళీ భరీ కోసం వైద్యశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి ఖాళీ భర్తీ కోసం ఈనెల 5న వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు పేరిట ఆ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని అందులో కోరారు. అభ్యర్థుల దరఖాస్తులను రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఆరోగ్యశాఖ కార్యదర్శికి పంపాలని ఆ ప్రకటనలో సూచించారు. ఉపకులపతి ఖాళీ భర్తీ కోసం కొన్ని అర్హతలను పేర్కొన్నారు. అందులో ప్రధానమైనది వైద్య రంగంలో కనీసం రెండేళ్లపాటు డీన్‌గా పనిచేసి ఉండాలి. లేదా వైద్య కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉండాలి. ఇక పదేళ్ల విద్యాసంవత్సర అనుభవమూ ఉండాలి అని అందులో పేర్కొన్నారు.


నిజానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డీన్‌ అంటూ ఉండరు. కేవలం ప్రైవేటు వైద్య కళాశాలల్లోనే డీన్‌ పోస్టులుంటాయి. ఈ డీన్‌ పదం చేర్చడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలల్లో పనిజేసిన వారికే ఉపకులపతి పదవి కట్టబెట్టాలనే ఆలోచతోనే ఈ డీన్‌ పదం చేర్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదేళ్ల విద్యాసంవత్సర అనుభవం అన్నది కూడా యూజీసీ నిబంధనలు విరుద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం పదేళ్లపాటు అధ్యాపకుడిగా పనిచేసి ఉండాలి. అయితే ఉపకులపతి ఖాళీ భర్తీకి సంబంధించి అర్హతల కోసం పదేళ్ల విద్యాసంవత్సర అనుభవం అన్నారు. అంటే అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్లకు కూడా ఈ పదవి కోసం అర్హత లభిస్తుంది. ఇటీవల రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఉపకులపతుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ యూజీసీ నిబంధనల మేరకే ఉన్నాయి.


వాటిల్లో పదేళ్ల పాటు అధ్యాపకుడిగా పనిచేసి ఉండాలన్న నియమాన్నే పాటించారు తప్ప పదేళ్ల విద్యాసంవత్సర అనుభవం అని ఎక్కడా చెప్పలేదు. అలాగే వైద్యశాఖ పేర్కొన్న అర్హతలన్నీ కూడా అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉన్నాయని అనుభవజ్ఞులైన అధ్యాపకులు అంటున్నారు. పాలనపరమైన అనుభవం విభాగంలో డీఎంఈ, అదనపు డీఎంఈ, డీన్‌, ప్రిన్సిపల్‌, వైద్య సంస్థ సంచాలకులుగా పనిచేసి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇది కూడా యూజీసీ నిబంధనలకు విరుద్ధమేనని అంటున్నారు. ఇలా ఎక్కడా లేని రూల్స్‌ను ఇక్కడే ఎందుకు పెడుతున్నారని సీనియర్‌ అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి గతంలో ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం, కేఎన్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఖాళీల భర్తీకి సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్లలో ఇటువంటి విచిత్రమైన నిబంధనలేవీ పెట్టలేదని వారు గుర్తు చేస్తున్నారు.


కాగా వైద్యశాఖ ఉన్నతాఽఽధికారులు తమకు నచ్చిన వారికే కాళోజీ విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవి కట్టబెట్టేందుకే ఇటువంటి నోటిఫికేషన్‌ ఇచ్చారని అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. అందుకే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై 13 రోజుల అవుతున్నప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో దరఖాస్తులు రాలేందని, ఐదారు దరఖాస్తులే వచ్చాయంటున్నారు. వాస్తవానికి ఇటువంటి నిబంధనలు లేకపోతే కనీసం 25-30 దరఖాస్తులు వచ్చేవని చెబుతున్నారు. డీన్‌గా రెండేళ్లపాటు పనిజేయాలన్న నిబంధనతో సర్కారులో పనిజేస్తున్న వారికి అర్హత లేకుండాపోయింది. అలాగే ప్రిన్సిపల్‌ అనే పదం చేర్చడంతో మనదగ్గర కొద్దిమందికే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరో నాలుగు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుందని, ఇప్పటికైనా అర్హతలను మారిస్తే మరిన్న దరఖాస్తులొస్తాయని సూచిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 04:43 AM