Share News

BJP: హామీల అమలెప్పుడు?

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:24 AM

‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన డిక్లరేషన్లు.. ఆరు గ్యారెంటీలు.. 400 హామీలు ఏమయ్యాయి..? ఎన్నికల ముందు మీరు స్వయంగా ప్రకటించిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు తులం బంగారం, 17 పంటలకు బోనస్‌ ఎప్పుడు ఇస్తారు..?

BJP: హామీల అమలెప్పుడు?

  • 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లు ఏమయ్యాయి

  • రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలి

  • కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

  • సమగ్ర సర్వే నివేదిక ఏమైంది?

  • కులగణన పేరిట హడావుడి: సంజయ్‌

హైదరాబాద్‌/సిరిసిల్ల/కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన డిక్లరేషన్లు.. ఆరు గ్యారెంటీలు.. 400 హామీలు ఏమయ్యాయి..? ఎన్నికల ముందు మీరు స్వయంగా ప్రకటించిన రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు తులం బంగారం, 17 పంటలకు బోనస్‌ ఎప్పుడు ఇస్తారు..? దళితబంధు ఉందా..? లేదా..? బీసీలు, గిరిజనులకు మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి..? వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారు..? స్పష్టమైన ప్రకటన చేయాలి’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ఆర్థికంగా దివాళా తీశాయని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై పునరాలోచన చేస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారని చెప్పారు. కర్ణాటక, హిమాచల్‌తో పోలిస్తే తెలంగాణ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్‌ ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్ల అప్పు చేసిందని తెలిపారు. ఇంకా ఎక్కడి నుంచి అప్పులు తీసుకోవాలన్న విషయమై ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్నే ఏర్పాటు చేసిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ హామీకి సంబంధించి ధైర్యముంటే హైకోర్టు సిటింగ్‌ జడ్జికి నివేదిక ఇవ్వాలని కిషన్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. ‘‘రైతు సంఘాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 38.63 లక్షల మంది రైతులకు రూ.33,265 కోట్లు రుణమాఫీ జరగాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం 22.23 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. రాహుల్‌గాంధీ మాత్రం, తెలంగాణలో రూ.31వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు సిగ్గులేకుండా ప్రచారం చేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాగా, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని కేటీఆర్‌ కూడా ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యంపై మహారాష్ట్ర ఓటర్లకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.


  • మాజీ సర్పంచ్‌ల అరెస్టు సరికాదు: సంజయ్‌

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వర్దవెల్లి గ్రామం మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురైంది. అక్కడ గుట్టపై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి నిత్య పూజలు, జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు బండి సంజయ్‌ బోటు సౌకర్యం కల్పించారు. సోమవారం బోటును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబం, మతం, ఆదాయం, ఆస్తుల వివరాలు నమోదు చేశారని.. ఇప్పుడు మళ్లీ కులగణన పేరుతో హడావుడి ఎందుకని అన్నారు. మాజీ సర్పంచ్‌లు రోడ్డెక్కి అడుక్కునే పరిస్థితికి గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలకులేనని బండి సంజయ్‌ విమర్శించారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని ఆ రెండు పార్టీలు హామీలిచ్చి.. గాలికొదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. సోమవారం కరీంనగర్‌లో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. పెండింగ్‌ బిల్లుల కోసం ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్‌ మండిపడ్డారు. వడ్లకు బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, దీనిపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Nov 05 , 2024 | 04:25 AM