Nirmal: అమ్మ అంత్యక్రియలకు కూతురి భిక్షాటన
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:28 AM
ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ బాలికను పదేళ్లుగా అమ్మే అన్నీతానై పెంచింది. కాయకష్టం చేస్తూ బిడ్డను సాకిన ఆ తల్లి మద్యానికి బానిసై కుటుంబ భారం మోయలేక ఆత్మహత్య చేసుకుని.. కన్నకూతురిని అనాథగా వదిలేసి వెళ్లిపోయింది.
11 ఏళ్ల కుమార్తె ప్రయాస ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కథనంతో పలువురి సాయం
నిర్మల్ జిల్లాలో ఒంటరి మహిళ ఆత్మహత్య
అంతిమసంస్కారాల నిర్వహణకు ఆమె 11 ఏళ్ల కుమార్తె ప్రయాస
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కథనంతో పలువురి సాయం
తానూర్, ఆగస్టు 18 : ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ బాలికను పదేళ్లుగా అమ్మే అన్నీతానై పెంచింది. కాయకష్టం చేస్తూ బిడ్డను సాకిన ఆ తల్లి మద్యానికి బానిసై కుటుంబ భారం మోయలేక ఆత్మహత్య చేసుకుని.. కన్నకూతురిని అనాథగా వదిలేసి వెళ్లిపోయింది. తనని అనాథ చేసి వెళ్లిపోయిన అమ్మ అంత్యక్రియల నిర్వహణకు ఆ చిన్నారి పడకూడని కష్టం పడింది. చేతిలో డబ్బు లేకపోడంతో భిక్షాటన చేసింది.. మానవత్వం ఉన్న ప్రతీ గుండెను కదిలించే ఈ ఘటనపై ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ చానల్‌లో కథనం ప్రసారమవ్వగా స్పందించిన పలువురు ఆ బాలికకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు.
నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన మేర గంగామణి(36) భర్త పదేళ్ల క్రితం చనిపోగా దుర్గ(11) అనే కుమార్తె ఉంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గంగామణి మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో కుటుంబపోషణ భారంగా మారగా.. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉరి వేసుకుని చనిపోయింది. దీంతో దుర్గ అనాథగా మిగిలిపోయింది. అయితే, తల్లి అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది.
ఇందుకు సంబంధించి ఫొటోలను గ్రామానికి చెందిన యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో పలువురు ఆర్థిక సాయం చేశారు. అలాగే, ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో స్పందించిన విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్ అధినేత వెంకటేశ్వరరావు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. అలాగే, ముథోల్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది రూ.8వేలు, బేల్‌తరోడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గజానంద్ రూ.5వేలు ఆర్థిక సహాయం చేశారు.
అందరి సాయంతో గంగామణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే, అనాథగా మిగిలిన దుర్గకు దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే గూగుల్‌పే నెం. 96766 36843 ద్వారా ముండె ఈశ్వర్(స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు)కు అందించాలని గ్రామ ప్రజలు తెలిపారు. కాగా, గంగామణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.