పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎలా?
ABN , Publish Date - Oct 14 , 2024 | 03:25 AM
అధికార కాంగ్రెస్ రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఆయన మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ
రేవంత్ పాలనలో రాజ్యాంగం ఖూనీ
ఏ పార్టీవారికి విప్ జారీ చేస్తారు?
చైర్మన్ బులెటిన్‌తో అనర్హతకు బలం
గవర్నర్, సీఎస్‌కు లేఖరాస్తాం: హరీశ్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా?
దీనికి మీరేం సమాధానం చెబుతారు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కౌంటర్
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అధికార కాంగ్రెస్ రాజ్యాంగ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్‌రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదివారం శాసనమండలిలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ చైర్మన్ స్వయంగా మహేందర్‌రెడ్డి చీఫ్ విప్‌గా ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. మండలి చైర్మన్ వద్ద మహేందర్‌రెడ్డిపై అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ట్రైబ్యునల్ చైర్మన్‌గా దాని మీద నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటి సమయంలో అధికారపార్టీ చీఫ్‌వి్‌పగా అదే కౌన్సిల్ చైర్మన్ బులిటెన్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.
దాన్ని పరిష్కరించకపోగా.. ఇప్పుడు మండలి చీఫ్‌వి్‌పగా ఆయన్ను నియమిస్తూ చైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చిందని, దీన్నికూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో రాజ్యాంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని కాంగ్రె్‌సలో చేర్చుకొని చీఫ్ విప్ పదవి ఇవ్వడంపట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. బిల్‌పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడాల్సిన బాధ్యత చీఫ్ విప్‌దని, అలాంటప్పుడు ఆయన ఎవరికి విప్ జారీచేస్తారు? అధికార పార్టీ సభ్యులకా? ప్రతిపక్ష పార్టీ సభ్యులకా? అని నిలదీశారు. పట్నం మహేందర్‌రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని విమర్శించారు. మహేందర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించడంపై రాష్ట్ర గవర్నర్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీవోపీటీకి కూడా ఫిర్యాదు చేస్తూ లేఖ రాస్తామని వెల్లడించారు.
గవర్నర్, సీఎ్‌సకు, పీఓటీకి లేఖ రాస్తాం
పాతతేదితో.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని చీఫ్‌వి్‌పగా నియమించినట్లు తాజాగా బులెటిన్ విడుదల చేసి.. అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని.. హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి మార్చి15న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పట్నం మహేందర్‌రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించారు. అలాంటప్పుడు.. 2024 ఆగస్టు13న జారీ చేసిన జీవోఆర్‌టీ నంబరు 1075 ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన్ను ఎమ్మెల్సీగానే పరిగణించారు. చీఫ్‌వి్‌పగా గుర్తించలేదని తెలిపారు. అదేవిధంగా 2024 సెప్టెంబరు 17న జీవోఆర్‌టీ నంబరు 1213 ద్వారా పట్నం మహేందర్‌రెడ్డిని ప్రజాపాలన దినోత్సవంలోనూ కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే పేర్కొన్నారని,. చీఫ్ విప్‌గా జీవోలో ఎందుకు సూచించలేదని ప్రశ్నించారు.
హరీశ్‌రావు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు: దుద్దిళ్ల
ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాజీమంత్రి హరీశ్ రావుకు ప్రతిదాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చీఫ్‌విప్ పదవి ఇవ్వడంపై హరీశ్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని వ్యవస్థలను ఆయన రాజకీయాల్లోకి లాగుతున్నారన్నారని విమర్శించారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో.. హరీశ్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా? పీఏసీ చైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టుపరిధిలో ఉందని.. న్యాయస్థానాది తుది నిర్ణయమన్నారు.