లగచర్లలో పారిశ్రామిక పార్కు!
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:17 AM
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా విలేజ్ స్థానంలో పారిశ్రామిక పార్క్ వస్తోంది. ఈ మేరకు శుక్రవారం రద్దయిన నోటిఫికేషన్ స్థానంలో శనివారం కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు.
రైతుల అంగీకారంతోనే భూసేకరణ
బలవంతంగా భూములు తీసుకోము
నోటిఫికేషన్‌లోనే ప్రభుత్వంస్పష్టత
మంచి ప్యాకేజీ ఇస్తారని అంచనా
వికారాబాద్/హైదరాబాద్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా విలేజ్ స్థానంలో పారిశ్రామిక పార్క్ వస్తోంది. ఈ మేరకు శుక్రవారం రద్దయిన నోటిఫికేషన్ స్థానంలో శనివారం కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో బహుళరంగ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో మొత్తం 182.31 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల్లో బహుళరంగ పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తారు. సేకరించనున్న భూమికి సంబంధించి రైతుల పేర్లు, సర్వే నెంబర్లతో నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా, రైతుల అంగీకారంతోనే భూ సేకరణ జరుగుతుందని, బలవంతంగా భూములు సేకరించబోమని అందులో స్పష్టం చేశారు మొదట భూములు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి భూమిని సేకరిస్తారు.
ఈసారి రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లగచర్ల, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ కోసం అంటూ గతంలో జారీ చేసిన ప్రకటనను ఇప్పటికే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఫార్మా విలేజ్ ప్రతిపాదనకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, ఇతర అధికారులపై దాడి జరగడం, రైతుల అరెస్టులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఫార్మా విలేజ్ ప్రతిపాదన ఉపసంహరించుకుంది. పారిశ్రామిక వాడ నిమిత్తం తొలి విడతగా సేకరించనున్న భూమి కేవలం 181.71 ఎకరాలే కావడం, స్ధానికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరికే అవకాశం ఉండటంతో ఈసారి భూసేకరణకు వ్యతిరేకత వచ్చే అవకాశాలు తక్కువని భావిస్తున్నారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు ద్వారా 20 వేల మందికి పైగా స్ధానికులకు ఉద్యోగావకాశాలు అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తొలి విడతలో వస్త్ర రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.. భూసేకరణ అధికారిగా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌ను నియమించారు.